పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ చేయాలని ఎస్ఈసీ ఈ నెల 11 న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేలా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ కృష్ణా జిల్లాకు చెందిన శ్రీపతి నాంచారయ్య, గుంటూరు జిల్లాకు చెందిన ఎం.ప్రతాప్ నాయక్ హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు సీనియర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ .. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదన్నారు.
ఈనెల 17, 21 తేదీల్లో జరగనున్న మూడు, నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును రికార్డు చేసేలా ఆదేశించాలని కోరారు. ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు వీడియోగ్రఫీ అవసరం అన్నారు. ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ .. ఈనెల 13 న ఇచ్చిన ఉత్తర్వులకు సవరణ చేస్తూ ఈ నెల 15 న ఉత్తర్వులు జారీచేశామన్నారు . అంత్యంత సున్నితమైన ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చామన్నారు . పూర్తిగా సీసీ కెమేరాల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికపరంగా సాధ్యపడదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేన్నారు.
ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. సమస్యాత్మక ప్రాంతాలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని , ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపునకు అనుసరిస్తున్న విధానం ఏమిటని ప్రశ్నించారు. విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
ఇదీచదవండి.