నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. శనివారం కర్ణాటక తీరప్రాంతం, గోవా అంతటా ప్రవేశించాయి. మహారాష్ట్రలో కొంత భాగం, ఉత్తర కర్ణాటకలోని మారుమూల ప్రాంతాలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆదివారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చని చెప్పారు.
* శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 6.3 మి.మీ సగటు వర్షం కురిసింది. కడప జిల్లాలో 26.1, అనంతపురం జిల్లాలో 18.5, చిత్తూరు జిల్లాలో 10.7 మి.మీ చొప్పున నమోదైంది. ఈ జిల్లాల్లోని 101 మండలాల్లో సగటున 10 మి.మీ పైనే వానలు కురిశాయి. అత్యధికంగా కడప జిల్లా రాయచోటిలో 108.50 మి.మీ వర్షపాతం నమోదైంది.
* శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు.. అత్యధికంగా తిరుపతిలో 63.5, అనంతపురం జిల్లా గుత్తిలో 54, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో 35.35 మి.మీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లా పెళ్లకూరు, కర్నూలు జిల్లా తుగ్గలిలోనూ తేలికపాటి జల్లులు పడ్డాయి.
11న బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి రుతుపవనాలు రానున్న పది రోజుల్లో ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్ వైపు కదలనున్నాయని శనివారం భారత వాతావరణ విభాగం తెలిపింది. బంగాళాఖాతంలో జూన్ 11న అల్పపీడనం ఏర్పడనుందని, ఆ కారణంగా జూన్ 15న ఆ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఎక్కడా వర్షాలు కురవకపోవచ్చని... రానున్న అయిదు రోజుల్లో ఎక్కడా వేడిగాలులు ఉండకపోవచ్చని అంచనా వేసింది.
తిరుమలలో కుండపోత
నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తిరుమలలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం పడింది. దీంతో భక్తులతోపాటు, ఘాట్‌రోడ్లలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షంతో తితిదే ఇంజినీరింగ్ అధికారులు ఘాట్ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇదీ చదవండి: