జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో రాంకీ కేసులోని నిందితుల డిశ్ఛార్జి పిటిషన్‌లపై మంగళవారం సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనలు పూర్తికాగా, పెన్నా సిమెంట్స్, భారతి సిమెంట్స్ కేసులో నిందితుల తరఫున వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా రాంకీ కేసులోనూ వాదనలు మొదలయ్యాయి.
రాంకీ కేసులో ప్రధాన నిందితుడైన సీఎం జగన్ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై మంగళవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదనరావు విచారణ చేపట్టారు. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 2002లో ఔషధ తయారీ రంగాన్ని హైదరాబాద్ నుంచి మార్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అయిదుగురు సభ్యుల కమిటీ శ్రీకాకుళం, విశాఖల్లో పర్యటించి పరవాడ పారిశ్రామికవాడను సిఫారసు చేసిందన్నారు. ప్రభుత్వం రాంకీకి ఫార్మాసిటీ ఏర్పాటు కాంట్రాక్ట్‌ను అప్పగించిందన్నారు. అది 2004 మార్చి 11న రాంకీ ఫార్మాసిటీ ఇండియా లిమిటెడ్ (ఆర్‌పీసీఐఎల్) పేరుతో కంపెనీని రిజిస్టర్ చేయించిందన్నారు. ఈ క్రమంలో ఆర్‌పీసీఐఎల్ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థగా ఆవిర్భవించిందన్నారు. దానికి ఏపీఐఐసీ వాటాగా 2143 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్ 1కి వాయిదా పడింది. వాన్‌పిక్, జగతి పెట్టుబడుల కేసులూ అదే తేదీకి వాయిదా పడ్డాయి. ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది.
ఇదీ చదవండి: నేడు విజయవాడకు సీఎం.. రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి శుంకుస్థాపన