రాజధాని అమరావతి పరిధిలో ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ నిర్మించడంలో విఫలమవ్వడమే కాకుండా .. తాము జమచేసిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ నాన్ - రెసిడెంట్ తెలుగు సొసైటీ ఇతర అవసరాల కోసం వినియోగించకుండా నిలువరించాలని కోరుతూ ఎన్ఆర్ఐలు పొట్లూరి సురేశ్‌తో పాటు మరో 17 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఆర్‌టీ ఐకాన్ యూనిట్ బుకింగ్, కొనుగోలు నిమిత్తం తాము చెల్లించిన కోట్ల రూపాయల సొమ్మును 24 శాతం వడ్డీతో తిరిగి చెల్లించేలా ఆదేశించాలని కోరారు. బ్యాంక్ ఖాతాలో తాము జమచేసిన సొమ్మును విత్ డ్రా చేయకుండా నిలువరించాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎఎస్ సోమయాజులు ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి .. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు, సీఆర్డీఏ కమిషనర్, ఏపీ రెరా చైర్మన్, మంగళగిరిలోని యాక్సిస్ బ్యాంక్కు నోటీసులు జారీ చేశారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ .. ఎన్ఆర్టీ ఐకాన్ టవర్లో యూనిట్ బుకింగ్ కోసం సొమ్ము వసూలు చేయడమే కాకుండా ప్రాజెక్టు పూర్తి చేస్తామని నమ్మించేలా చేసి పిటిషనర్ల వద్ద నుంచి సొమ్మును వసూలు చేశారన్నారు. పిటిషనర్లు, మరి కొందరు చెల్లించిన కోట్ల సొమ్మును ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు తన వద్ద ఉంచుకున్నారన్నారు. అంతేకాక పిటిషనర్లు ఇప్పటికే జమచేసిన సొమ్మును స్వాధీనం చేసుకుంటామని ఎన్ఆర్డీఎస్ సొసైటీ చట్ట విరుద్ధంగా నోటీసులిచ్చిందన్నారు. టవర్లో యూనిట్ బుకింగ్, కొనుగోలు కోసం పిటిషనర్లు, మరికొందరు మంగళగిరిలోని యాక్సిస్ బ్యాంక్ లో 17 కోట్లు జమ చేశారన్నారు. ఆ సొమ్మును విత్ డ్రా చేసి ఇతర అవసరాలకు వినియోగిస్తే పిటిషనర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఎన్ఆర్‌టీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం కానీ, ఏపీఎన్ఆర్టీఎస్ కానీ కనీస చర్యలు తీసుకోలేదన్నారు. అలాంటప్పుడు పిటిషనర్ల సొమ్మును దగ్గర ఉంచుకోవడం చట్ట విరుద్ధమన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు.
ఇదీ చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. తరగతుల విలీనంపై విద్యాశాఖ ఆదేశాలు