Woman died in Amarnath yatra: రాష్ట్రం నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో కొందరి ఆచూకీ తెలియకపోవడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి మృతి చెందారు. 48 ఏళ్ల గునిశెట్టి సుధ మృతదేహం శ్రీనగర్ ఆస్పత్రిలో ఉన్నట్లు రాష్ట్ర అధికారులు గుర్తించారు. సుధ స్వస్థలం రాజమహేంద్రవరంలోని కుమారీ టాకీస్ ప్రాంతం. రాజమహేంద్రవరానికి చెందిన మరో మహిళ కొత్త పార్వతి ఆచూకీ కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
నెల్లూరు జిల్లా నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో మరో 25 మంది వరకూ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఆచూకీ దొరకని వారి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని... నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా నుంచి 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారని.. వారిలో 57 మంది సురక్షితంగా ఉన్నట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. యాత్రికులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమర్నాథ్ గుహ వద్ద.. ఆకస్మిక వరదల నుంచి ప్రాణాలతో బయటపడిన నెల్లూరు జిల్లా యాత్రికులు తమ కుటుంబీకులకు ఫోన్ చేసి క్షేమ సమాచారం ఇస్తున్నారు.
చిత్తూరు జిల్లా నుంచి అమర్‌నాథ్ వెళ్లిన ఆరుగురు యాత్రికులు సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. విజయనగరం నుంచి అమర్‌నాథ్ వెళ్లిన నాగేంద్ర.. గుంటూరు జిల్లా నుంచి వెళ్లిన మరో యాత్రికుడు క్షేమంగా ఉన్నట్లు వారి కుటుంబీకులకు సమాచారం అందింది.
ఇవీ చూడండి: