కొత్త ఇసుక విధానంలో రీచ్‌ల నిర్వహణ, విక్రయాల బాధ్యతలకు కేంద్ర సంస్థల నుంచి స్పందన లేకపోతే.. 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు గనులశాఖ సిద్ధమవుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ-టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అనుభవమున్న పెద్ద సంస్థలు వచ్చేలా అర్హతలు నిర్ణయిస్తారని చెబుతున్నారు. టెండర్లు వేసేందుకు 3 వారాల గడువు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్వహిస్తున్న రీచ్‌లు, నిల్వ కేంద్రాల్లోని సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిల నిర్వహణ బాధ్యతలను టెండరు దక్కించుకునే సంస్థలకే అప్పగించనున్నారు.
ఆ సిబ్బందిని కొనసాగిస్తారా?
ప్రస్తుతం ఏపీఎండీసీ పరిధిలో ఉన్న రీచ్‌లు, నిల్వ కేంద్రాల్లో 1800 మంది వరకు పొరుగు సేవల సిబ్బంది ఉన్నారు. కొత్తగా ఇసుక బాధ్యతలను తీసుకునే ప్రైవేటు సంస్థల్లో వీరిని వినియోగించే అవకాశం ఉందని సమాచారం. అయితే గతంలో అనేక రీచ్‌లు, నిల్వ కేంద్రాల్లో స్థానిక నేతలు సూచించిన వారిని నియమించారు. పలుచోట్ల జరిగిన ఇసుక అక్రమాల్లో కొందరు పొరుగు సేవల సిబ్బంది పాత్ర ఉందనేది బయటపడింది. ఈ నేపథ్యంలో వారందరినీ కొనసాగిస్తే మళ్లీ ఇసుక అక్రమాలకు ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: చంద్రబాబు