Funds released for RGUKT : తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, వాటితో విద్యార్థుల డిమాండ్లు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అన్నారు. ఈ మేరకు మంగళవారం విద్యాలయంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకటరమణ, డైరెక్టర్ సతీష్‌కుమార్‌లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు.
గత నెలలో విద్యార్థులు చేసిన డిమాండ్ల మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి రూ.16 కోట్లు మంజూరు చేశారన్నారు. రూ.11 కోట్లు విద్యాలయ ఖాతాలో జమయ్యాయని.. వాటితో పాత భోజనశాలలో టైల్స్, మురుగు కాలువలు, మరుగుదొడ్లు, విద్యుత్తు దీపాలు, తరగతి గదుల్లోని చిన్న చిన్న మరమ్మతులను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు వివరించారు.
ఇప్పటికే 1500 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా భోజనశాలను సిద్ధం చేశామన్నారు. భోజనశాల, క్యాంటీన్‌కు సంబంధించిన కాంట్రాక్టు సమయం ముగిసిందని, త్వరలో నూతన టెండర్లు పిలుస్తామని తెలిపారు. భోజనశాలలో ఎలాంటి అవినీతి జరగకుండా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. 1450 మంది విద్యార్థులకు నూతన ల్యాప్‌టాప్‌లు అందజేశామన్నారు.
విద్యార్థినులుండే వసతి గృహాలలో సీసీ కెమెరాలు, వారి సమస్యల పరిష్కారానికి మహిళా ఎస్‌ఐని నియమించామని, రెండు రోజుల్లో బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. విద్యార్థులకు ముథోల్‌లోని ఎల్వీప్రసాద్ వైద్యులతో కంటి పరీక్షలు చేయిస్తామన్నారు. విద్యాలయంలో చెత్త నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా ఎరువుల తయారీ చేపడతామన్నారు. ఎన్‌సీసీ ప్రారంభించడానికి చర్యలు మొదలుపెడుతున్నట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: