హైదరాబాద్ పరిధిలోని కీలకమైన జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు ఆరు వరుసల రోడ్డుతోపాటు రెండు వైపులా మరో ఆరు వరుసల సర్వీసు రోడ్లు రూపుదిద్దుకోనున్నాయి. తొమ్మిది చోట్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. దీనికి నిధుల మంజూరుకు కేంద్రం అంగీకరించింది. ఈ రోడ్లు పూర్తయితే.. ఎల్బీనగర్ నుంచి జాతీయ రహదారిపై వాహనాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా వెళ్లవచ్చు.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిలో ఎల్‌బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు 25 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించలేదు. ఇది కొన్నిచోట్ల ఎనిమిది లైన్లు, మరికొన్నిచోట్ల ఆరు లైన్లు, కొన్నిచోట్ల నాలుగు లైన్లుగా ఉంది. ఎల్‌బీనగర్ నుంచి మహానగర సరిహద్దులు దాటే వరకు పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. కాలనీలు, గ్రామాల్లోని ప్రజలు జాతీయ రహదారిని దాటి ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారులు రూ. 545 కోట్లతో విస్తరణ ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారులు దీనికి ఆమోదం తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ఆర్ అండ్ బీ అధికారులు సిద్ధమవుతున్నారు.
రెండేళ్లలో పూర్తి చేస్తాం
'కీలకమైన జాతీయ రహదారి విస్తరణ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది పూర్తయితే విజయవాడకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు. ఏటా ఈ జాతీయ రహదారిపై తిరిగే వాహనాల సంఖ్యపెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా విస్తరణ పనులకు ఆమోదం తెలిపారు. కొద్దిరోజుల్లోనే టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగిస్తాం.'
- ఐ.గణపతిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ
ఇదీ ప్రణాళిక..
- ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జాతీయ రహదారిని పూర్తిస్థాయిలో ఆరులైన్లుగా నిర్మిస్తారు. అవుటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వరకు అంటే 11 కిలోమీటర్ల మేర రెండువైపులా మూడేసి లైన్ల చొప్పున ఆరులైన్ల రోడ్లు నిర్మితమవుతాయి. అవుటర్ జంక్షన్ నుంచి కొత్తగూడెం వరకు ఏడు కిలోమీటర్ల పొడవున సర్వీసు రోడ్డు నిర్మిస్తారు. కొత్తగూడెం నుంచి మల్కాపూర్ వరకు పూర్తిగా గ్రామీణ ప్రాంతమైనందున ఈ ప్రాంతాల మధ్య సర్వీసు రోడ్డు ఉండదని ఎన్‌హెచ్ విభాగం ఎస్‌ఈ కె.శ్రీనివాస్ తెలిపారు.
- వనస్థలిపురం, పనామా, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, కోహెడ జంక్షన్, కవాడిపల్లి జంక్షన్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇనాంగూడ, బాటసింగారం ప్రాంతాల్లో అండర్ పాస్‌లు నిర్మిస్తారు. దీనివల్ల స్థానికులు జాతీయరహదారిపైకి రానవసరం లేకుండా, సర్వీసు రోడ్లపై సులువుగా ప్రయాణించవచ్చు. హైవేపై రెండువైపుల నుంచి ఎవరూ రాకుండా ఉండడానికి ఫెన్సింగ్ కూడా నిర్మిస్తారు.
- విస్తరణ పూర్తయితే ఈ రోడ్డు దాదాపు ఎక్స్‌ప్రెస్ హైవేగా రూపుదిద్దుకోనుంది. ఎక్కడా ఆగకుండా ప్రయాణించడానికి అవకాశం ఉంది. సాధారణంగా జాతీయ రహదారుల వెంబడి సర్వీసు రోడ్లను రెండువైపులా నాలుగు లైన్లుగానే నిర్మించారు. మొదటిసారి ఈ జాతీయ రహదారిపై ఏకంగా రెండువైపులా ఆరులైన్ల సర్వీసు రోడ్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇదీ చూడండి: