గత కొద్ది కాలంగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో భాగంగా జరుగుతున్న కూల్చివేతలు తాజాగా గీతం విశ్వవిద్యాలయం వరకు వచ్చాయి. 40 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని గీతం ఆధీనంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ భూమిని స్వాధీన పరుచుకునే దిశగా శనివారం తెల్లవారుజామున చర్యలు ప్రారంభించారు.
ఉదయం 3గంటలకే...
ఉదయం 3గంటల సమయంలో గీతం ఇంజినీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం వద్దకు రెవెన్యూ అధికారులు వచ్చారు. సెక్యూరిటీ పోస్టుతో పాటు అటుఇటు ఉండే గోడలను కూల్చివేశారు.ఆక్రమణలకు సంబంధించి ఇప్పటికే గీతం యాజమాన్యానికి సమాచారం అందించినట్లు అధికారులు చెప్పారు. ఆ తరువాత గీతం మెడికల్ ఆసుపత్రి వైపు చేరుకున్నారు. నార్త్ గేట్ కి ఆనుకుని ఉన్న మైదానం వైపు ఉన్న గోడను పూర్తిగా కూల్చారు. రెండు జేసీబీలతో కొద్దినిమిషాల వ్యవధిలోనే మెయిన్ రోడ్డు నుంచి నార్త్ గేట్ వరకు ఉన్న గోడను తొలగించి భూమిని స్వాధీన పరుచుకున్నారు. ఒకటిన్నర ఎకరా ఆక్రమిత స్థలంలో వివిధ నిర్మాణాలు ఉన్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. తదుపరి దశలో నిర్మాణాల తొలగింపు చేపడతామని చెప్పారు.
ఖండించిన ఉద్యోగులు...
గీతం విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వ ధోరణిని గీతం ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విద్య, వైద్య రంగాల్లో ఎంతో సేవ చేస్తున్న వర్సిటీపై ప్రభుత్వం వివిధ కారణాలతో ఈ రీతిలో వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. హుద్ హుద్ విధ్వంసం, కొవిడ్ మహమ్మారి వంటి కష్ట కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక విధాలుగా గీతం సహకారం అందించిందని గుర్తు చేశారు. కొవిడ్ ఆసుపత్రిగా సేవలు అందిస్తున్న ఆసుపత్రి ప్రహారీ గోడను కూల్చి వేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాజమాన్యానికి ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని... కనీస ముందస్తు సమాచారం లేకుండా రెవెన్యూ శాఖ కూల్చి వేతల ప్రక్రియ చేపట్టిందని చెప్పారు. కూల్చి వేత ప్రక్రియ కోసం ప్రభుత్వం గీతం వర్సిటీ చుట్టు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది.
ఇదీ చదవండి