లాక్‌డౌన్ నేపథ్యంలో పొలాల్లోనే ఉన్న పండ్లు, కూరగాయల్ని నేరుగా వినియోగదారులకు చేరవేయడంలో రైతు ఉత్పత్తి సంఘాలు, పొదుపు సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు తీసుకుంటున్న ఈ చొరవతో రైతులకు మంచి ధర లభించడంతోపాటు, వినియోగదారులకు నాణ్యమైన పండ్లు అందుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాఫెడ్ సైతం పండ్లను సేకరించి దిల్లీకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టింది.
మామిడి డజను రూ.250 నుంచి రూ.300
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పక్వానికి వచ్చిన మామిడి పండ్లను రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా విజయవాడలోని అపార్టుమెంట్లకు చేర్చి విక్రయిస్తున్నారు. ఇప్పటిదాకా 4 టన్నులు విక్రయించామని ఉద్యానశాఖ అధికారి రవికుమార్ వివరించారు. ఫోన్‌చేస్తే ఇళ్లకు తెచ్చి అందిస్తారన్నారు.
డజను మామిడి ధరలు: ఆల్ఫాన్సా రకం రూ.300, బంగినపల్లి, చిన్న రసాలు రూ.250
ఫోన్ నంబరు: 7995086879, 7382353027 (వాట్సాప్)
రూ.వందకే పండ్ల కిట్
కర్నూలులోని రెడ్‌జోన్లలో రూ.వందకే ఐదురకాల పండ్ల కిట్ అందించే పనిలో ఉద్యానశాఖ నిమగ్నమైంది. రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా పండ్లు కొనుగోలు చేయించి.. కిట్లు తయారు చేయిస్తున్నామని ఏడీ రఘునాథరెడ్డి చెప్పారు. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు వీటిని రెడ్‌జోన్లలో విక్రయిస్తామన్నారు. ప్రస్తుతం రెండు రైతు ఉత్పత్తి సంఘాలు ముందుకొచ్చాయని, మరికొందరితో చర్చిస్తున్నామని తెలిపారు. రోజుకు 2వేల కిట్లు అమ్మాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు.
కిట్‌లో ఉండేవి: పెద్ద బొప్పాయి, కర్బూజా, అరటి 8, బత్తాయి 5, నిమ్మకాయలు 5
అరటి,
టమాటా సేకరణ
మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో కడప, అనంతపురం జిల్లాల్లో ఇప్పటిదాకా 7,130 టన్నుల అరటిని కొనుగోలు చేశారు. ఇందులో 1,960 టన్నుల్ని రైతుబజార్ల ద్వారా, మిగిలిన నిల్వలను పొదుపు సంఘాల ద్వారా విక్రయించే ఏర్పాటుచేశారు. మదనపల్లె, పలమనేరు మార్కెట్ల నుంచి 462 టన్నుల టమాటా కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయించామని సీఈవో ఇస్రార్‌అహ్మద్ తెలిపారు. బత్తాయి 16 టన్నులు కొనుగోలు చేశామని వివరించారు. త్వరలో మామిడిని విక్రయిస్తామన్నారు.
రంగంలోకి నాఫెడ్
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నాఫెడ్ సైతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పండ్లను సేకరించడానికి సిద్ధమైంది. అరటి, దానిమ్మ, బత్తాయి, పైనాపిల్, మామిడి తదితర పండ్లను ప్రత్యేక రైళ్లలో దిల్లీకి తరలించి మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించడానికి ఏర్పాట్లుచేసింది. నిల్వ చేయడానికి దిల్లీలోని అజాద్‌పూర్‌మండిలో శీతల గోదామును సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. రైతులు, రైతుఉత్పత్తి సంఘాలు తమను సంప్రదించాలని నాఫెడ్ జీఎం శ్రీవాత్సవ సూచించారు. ఫోన్: 70428 84468
ఇదీ చదవండి: వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించండి: సీఎం జగన్