రాజధాని అమరావతి సాధనలో... రైతుల అలుపెరగని పోరు 75వ రోజుకు చేరింది. రాజధాని కోసం భూసమీకరణకు 75 శాతం భూములను ధారాదత్తం చేసి 25 శాతం మాత్రమే తాము వెనక్కి తీసుకుంటే... తమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు, 24 గంటల దీక్షలతో హోరెత్తిస్తున్న అన్నదాతలు.... మున్ముందూ ఇదే జోరు కొనసాగిస్తామని ప్రకటించారు.
పెరుగుతున్న మద్దతు
రైతుల ఆందోళనలకు... కడప జిల్లా రాయచోటి సహా కర్ణాటక, హైదరాబాద్‌ల నుంచి అనేక మంది సంఘీభావం తెలిపారు. రాజధాని వాసులకు జరుగుతున్న అన్యాయం చూసి చలించపోయామని వాపోయారు. అమరావతిలో రైతులకు ఇళ్ల నిర్మాణం పూర్తయినా ..ప్రభుత్వం ఎందుకు కేటాయించడం లేదని మండిపడ్డారు.న్యాయం కోరుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అణచివేత ధోరణి అవలంబిస్తున్నారంటూ ఆక్షేపిస్తున్నారు. రాజధానికి భూములిస్తే... బయటివారికి పంచిపెట్టడం ఏంటని ప్రశ్నించారు.
కన్నా పర్యటన
ఇవాళ తుళ్లూరులో.... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ ఏర్పాటు జరగనుంది. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో... గుంటూరు నుంచి తుళ్లూరు వరకూ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగనున్నాయి.
ఇదీ చదవండి : పులివెందుల రాజకీయాలను విశాఖ తీసుకొస్తున్నారు: కళా