అమరావతి ప్రాంత రైతులు రోజురోజుకు పోరాట తీవ్రతను పెంచుతున్నారు. మందడంలో చేపట్టిన దీక్షలో విదేశాల్లో చదువుకుంటున్న స్థానిక విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలు మ్యూజిక్ ఛైర్స్ ఆడుతూ జై అమరావతి అంటూ నినదించారు. దేశాలన్నీ కార్యాలయాలను ఒకే దగ్గరకు చేర్చి పాలనా వ్యయం తగ్గించుకునేందుకు చూస్తున్నాయన్న విద్యార్థులు... జగన్ మాత్రం వ్యతిరేక పంథాను అనుసరిస్తున్నారన్నారు. 3 రాజధానుల అంశంపై బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తుళ్లూరులో రైతులు మహాధర్నా నిర్వహించారు. రైతులతో మాట్లాడామంటున్న ప్రభుత్వ పెద్దలు.... భూములిచ్చిన 29వేల మందిలో ఎవరితో మాట్లాడారో చెప్పాలని నిలదీశారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకొని రైతులు, రాష్ట్రాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వెలగపూడిలో విద్యార్థులు 151 గంటల నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. యువత ముందుకొచ్చి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఆందోళనల్లో పాల్గొన్న మహిళలు పిలుపునిచ్చారు.
సీఎం జగన్ మనసు మారాలంటూ అమరావతి రైతులు మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని పొంగళ్లు సమర్పించారు. అమరావతికి మద్దతు తెలపాలని కోరుతూ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఐకాస, విద్యార్థులు ధర్నా చేశారు. వీరికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అమరావతికి మద్దతుగా మంగళగిరి మండలం పెదవడ్డపూడిలో రైతులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
ఇదీ చదవండీ... ఈనాడు సాయం.. మాన్పింది గాయం