రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కాస్మోటిక్స్ కొనుగోళ్ల వ్యవహారంలో గోల్‌మాల్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. విజయవాడలోని ఈఎస్ఐ సంచాలకుడి కార్యాలయంలో వారం రోజులుగా విజిలెన్స్ బృందాలు చేస్తున్న సోదాల్లో అనేక అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. రోగులకు అవసరమైన మందులు కాకుండా, తమకు కమీషన్లు వచ్చే వాటికే ఉన్నతాధికారులు ప్రాధాన్యమిచ్చినట్లు తేలుతోంది. నిత్యం అనేక మంది మధుమేహానికి ఉపయోగించే ఇన్సులిన్, బీపీ మందులకు బదులు..జుట్టు ఎత్తుగా పెరిగే నూనెలు, సౌందర్యాన్ని పెంచే క్రీములను భారీగా కొనుగోలు చేసినట్లు తనిఖీల్లో బయటపడింది.
నాలుగు నెలలుగా సరఫరా లేదు
ఆరోగ్య కేంద్రం నుంచి ప్రతినెలా ఇండెంట్ ఆధారంగా విజయవాడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీటిని సరఫరా చేస్తారు. గత నాలుగునెలలుగా ఆయా మందులను ఆస్పత్రులకు సరఫరా చేయడంలేదు. వీటి కొనుగోళ్లు నిలిపివేయడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. విజయవాడ ఈఎస్ఐ కార్యాలయంలో గడువు దగ్గరపడుతున్న మందులు పెద్దసంఖ్యలో గుట్టలుగుట్టలుగా పడేసి ఉన్నాయి. వీటిని చాలా ఏళ్లుగా సరఫరా చేయకుండా అక్కడ పడేసినట్లు సోదాల్లో వెల్లడైంది. మోకాళ్ల నొప్పులకు వినియోగించే 'నీ క్యాప్‌లు', నడుము నొప్పికి వాడే బెల్టులను 2017లో పెద్దసంఖ్యలో కొని అలానే నిరుపయోగంగా వదిలేశారు.
నచ్చిన సంస్థల నుంచి ఔషధాలు
ఔషధాల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. సదరు జాబితాలోని సంస్థల నుంచి మాత్రమే రాష్ట్ర అధికారులు మందులను కొనుగోలు చేయాలి. ఈ నిబంధనను పక్కనబెట్టి, తమకు నచ్చిన సంస్థల నుంచి కొన్ని రకాల ఔషధాలనే అధికారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లకు దాదాపుగా 10 రెట్లు అధికంగా వెచ్చించినట్లు తేలింది.
ఎస్టీపీల నిర్మాణంలోనూ అవినీతి
ఆస్పత్రుల్లోని వృథానీటిని శుద్ధిచేసేందుకు ఏర్పాటు చేసిన ఎస్టీపీల నిర్మాణంలోనూ అవినీతి మేటలు వేసింది. విజయవాడ, కర్నూలు జిల్లా ఆదోని, తిరుపతి, రాజమహేంద్రవరంలో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి కోటీ 90 లక్షలు వెచ్చించారు. వీటికి ఏర్పాటుకు ఎక్కడా టెండర్లు పిలవలేదు. గుత్తేదారుకు ఏకపక్షంగా కట్టబెట్టారు. వీటి నిర్వహణకు ఏటా 20 లక్షలకుపైగా ఖర్చు చెల్లిస్తున్నారు. వీటికి సంబంధించి కనీసం ఒప్పంద పత్రాలు కూడా లేవని గుర్తించారు. ఈ అవినీతి వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా సోదాల్లో లభించిన ఆధారాలతో మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
ఇదీ చదవండి :