పోరాడి ఫలితం సాధించలేక పోయామే అని ఉద్యోగులు నిరాశలో ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాలు రోడ్డున పడి పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సరికాదని ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాలు సంయమనంతో వ్యహరించాలని ఎలాంటి ప్రత్యారోపణలు చేయవద్దని సూచించారు. సచివాలయంలో పోస్టర్లు అంటించిన ఘటనతో పాటు పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ల వ్యవహారంపై ఉద్యోగ సంఘాల్లో వివాదాలు ఏర్పడటంతో వెంకట్రామిరెడ్డి ఈ ప్రకటన విడుదల చేశారు.
రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తనపై చేసిన ఆరోపణలు బాధ కలిగించాయని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గత పది రోజులుగా అన్ని ఉద్యోగ సంఘాలు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న సమయంలో ఎన్నికలు ఉద్యోగులకు భారం అవుతాయి కనుక వాయిదా వేయాలని కోరాయన్న వెంకట్రామిరెడ్డి... అందరూ మొదట ఎన్నికల కమీషన్ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు. కోర్టు తీర్పు కమిషన్కు అనుకూలంగా రావడంతో అంతా మాట మార్చి ఇతర సంఘాలపై నింద మోపి వాటి బలాన్ని తగ్గించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి:
'ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోంది'