ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి 25 నుంచి 30 శాతం మేర ఖాళీలను బ్లాక్ చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పోస్టుల బ్లాకింగ్ అనేది కొత్త అంశం కాదని మంత్రి చెప్పుకొచ్చారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉండే పాఠశాలలను దృష్టిలో ఉంచుకుని ఖాళీలను బ్లాక్ చేసినట్టు మంత్రి వివరించారు. 50 శాతం పోస్టులు బ్లాక్ అయ్యాయన్నది వాస్తవం కాదన్నారు.
ఉపాధ్యాయ బదిలీల్లో ఆన్లైన్ ఆప్షన్లు ఇవాళ్టి నుంచి మొదలయ్యాయని మంత్రి వెల్లడించారు. ఐదు రోజుల పాటు మాత్రమే ఆన్ లైన్ లో ఎన్ని ఆప్షన్లైనా నమోదు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. 16వ తేదీన ఉపాధ్యాయుల బదిలీల కోసం చేసిన వెబ్ ఆప్షన్లను ఫ్రీజ్ చేస్తామని చెప్పారు. పారదర్శకత కోసమే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. చాలా సమయంతో పాటు శ్రమతో కూడిన మాన్యువల్ కౌన్సిలింగ్ ప్రస్తుతం సాధ్యం కాదన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను నాలుగు కేటగిరీలుగా విభజించామని పేర్కొన్నారు. 1,72,082 ఉపాధ్యాయ పోస్టులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వెబ్ ఆప్షన్లకు సంబంధించి సాఫ్ట్ వేర్లో ఎలాంటి లోపాలు లేవని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి