ఘాట్లు,కేశఖండన శాలకుఅనుమతి లేదు
దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం రూ.4 కోట్ల వ్యయంతో ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు వెల్లడించారు. మల్లికార్జున మహామండపంలో బుధవారం పాలకమండలి సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఈవో సురేష్‌బాబు, సభ్యులతో కలిసి ఛైర్మన్ విడుదల చేశారు. ఉత్సవాలపై సమీక్షించారు. అనంతరం సోమినాయుడు మాట్లాడుతూ.. కొవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్లో టిక్కెట్లు తీసుకున్న భక్తులను మాత్రమే క్యూలైన్లోకి అనుమతిస్తారని చెప్పారు. 21న మూలా నక్షత్రం నాడు సంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, దేవదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు. దసరా ఏర్పాట్లకు సంబంధించి 37 అంశాలపై పాలకమండలి సమావేశం చర్చించింది. 35 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఒక అంశాన్ని తిరస్కరించి, మరో అంశాన్ని తదుపరి సమావేశంలో చర్చించేందుకు వాయిదా వేసినట్లు ఛైర్మన్ తెలిపారు.
దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేస్తున్న పాలకమండలి
ఛైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు, సభ్యులు
తిరస్కరణ
*● కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పరోక్ష ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు, కుంకమ ప్రసాదం పోస్టలు విభాగం ద్వారా బట్వాడా చేసే ప్రతిపాదనను సభ్యులు తిరస్కరించారు.
*● భక్తుల సెల్‌ఫోన్ల భద్రపరిచే టెండరుపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ఆమోదం పొందిన తీర్మానాలు
*● దసరా ఉత్సవాల్లో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రూ.90.90 లక్షలతో షామియానాలు, షెడ్లు, క్యూలైన్లు, మొబైల్ టాయిలెట్లు, సీసీ కెమెరాలు, విద్యుద్దీపాల ఏర్పాటుకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
*● విస్తరించిన మల్లేశ్వరాలయ స్థలంలో 9.50లక్షలతో షెడ్లు, హిల్ ప్రొటక్షన్‌కు రూ.9.90లక్షలు, కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులకు రూ.7లక్షల ప్రతిపాదనలు.
*● దేవస్థానానికి సంబంధించి కంకిపాడు మండలం పునాదిపాడులోని 7.86 ఎకరాల మాగాణి భూమి లీజును మరో మూడు సంవత్సరాలు పొడిగింపు.
ఒకే చోట మాల ధారణ.. విరమణ
కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా దసరా ఉత్సవాల్లో ఘాట్లు, కేశఖండన శాలకు అనుమతి ఇవ్వలేదని సోమినాయుడు తెలిపారు. భవానీ దీక్షాధారులు మాలధారణ ఎక్కడ చేశారో అక్కడే మాల విరమణ చేయాల్సి ఉంటుందన్నారు. ఈవో సురేష్‌బాబు మాట్లాడుతూ.. ఉత్సవాల తొలిరోజు 17న సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అమ్మవారి అలంకరణ, ఉదయం 9గంటలకు దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుందన్నారు. మూలా నక్షత్రం రోజున ఉదయం 3 నుంచి రాత్రి 9గంటల వరకు అనుమతిస్తామన్నారు.
22న మలికార్జున మహామండపం ఆరో అంతస్తులో అర్చక సన్మాన సభ, 24న వేద విద్వత్, 25న గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు కృష్ణానదిలో తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈఈ భాస్కర్, ఏఈవోలు రమేష్, వెంకటరెడ్డి, సుధారాణి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి