Digitalization Of Old Documents :ప్రజలకు సత్వర సేవలు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం స్టాంపులు-రిజిస్ట్రేషన్‌శాఖలో పాత డాక్యుమెంట్ల డిజిటలీకరణకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల ప్రజలకు త్వరలో పూర్తిస్థాయిలో కంప్యూటర్ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం 1999 తర్వాత జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు మాత్రమే ప్రజలకు ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి. అంతకు మునుపు జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలన్నీ మాన్యువల్ రికార్డుల రూపంలో గుట్టగుట్టలుగా పడి ఉన్నాయి. వాటి నిర్వహణ కొరవడి విలువైన సమాచారం చేజారిపోతోంది. భవిష్యత్తులో ప్రజలుకోరే ఏ రిజిస్ట్రేషన్ సమాచారమైనా ఇట్టే క్షణాల్లో అందించటానికి వీలుంటుంది. పాతవి కావాలంటే ఆ రికార్డులు వెతికి మాన్యువల్‌గా రాసివ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది చాలా కాలాతీతంతో కూడుకున్నదని, ఆపై అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించటం కూడా కష్టంగా ఉంటోంది. దీన్ని అధిగమించటానికి కంప్యూటరీకరణ ఉపయోగపడుతుంది.
స్టాంపులు-రిజిస్ట్రేషన్‌శాఖలో శాఖలో 1999 తర్వాత కంప్యూటరీకరణ ప్రారంభమైంది. అప్పటి నుంచే ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావటం ప్రారంభమైంది. అంతకు మునుపు జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలను శాఖ అధికారులు ఒక పెద్ద వాల్యూమ్ పుస్తకంలో చేతితో రాసి భద్రపరిచేవారు. ఆ రికార్డుల్లో ఏదైనా పోతే అందులో ఉన్న ఆస్తుల వివరాలను ధ్రువీకరించుకోవటానికి శాఖకు మరో ప్రత్యామ్నాయం లేకుండా ఉంది. ఆపై మాన్యువల్ రికార్డులు ఏళ్ల తరబడి ఐరన్ ర్యాక్స్‌పై కనీసం నిర్వహణ లేకుండా పడి ఉండటంతో నామరూపాలు కోల్పోతున్నాయి.
రికార్డులకు చెదలు పట్టడం, పేజీలు చిరిగిపోవటం వంటివి చోటుచేసుకుని విలువైన సమాచారం పోతోంది. ఈ నేపథ్యంలో అధునాతన స్కానర్ల ద్వారా డిజిటలీకరణచేసి ఆ తర్వాత ఆ సమాచారాన్ని కంప్యూటరీకరణ చేయాలని ఆదేశించారు. గుంటూరు, కొరిటిపాడు, నల్లపాడు,. తాడికొండ, చేబ్రోలు, తెనాలి, రేపల్లె, బాపట్ల, సత్తెనపల్లి,. చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల తదితర కార్యాలయాల్లో ఇప్పటికే డిజిటలీకరణ ప్రారంభమైందని అధికారవర్గాలు తెలిపాయి. మిగిలిన కార్యాలయల్లోనూ చేపట్టి రానున్న ఆరు మాసాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెండర్ల విధానంలో ఓ ప్రైవేటు ఏజెన్సీ ఈ పనులను దక్కించుకుంది.
డిజిటలీకరణ ఎలా చేస్తున్నారంటే.. నిమిషానికి పది నుంచి 15 పేజీలను స్కాన్ చేసే పెద్ద స్కానర్లు ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 3 నుంచి 5 వరకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నాలుగైదు కంప్యూటర్లు అమర్చారు. సగటున రోజుకు రెండు నుంచి నాలుగు వాల్యూమ్స్ పూర్తవుతున్నాయి. గుంటూరు ఆర్వోలో నెలకు కనీసం 200 వాల్యూమ్స్ ఉంటాయి. ఇలా 1850 నుంచి 1999 వరకు లెక్కిస్తే కొన్ని వేల వాల్యూమ్స్ అవుతాయి. ఇవన్నీ కంప్యూటరీకరణ చేయటానికి కనీసం ఆరేడు మాసాలు పడుతుందని పొరుగుసేవల సిబ్బంది అంటున్నారు.
ఈసీలు సులువుగా పొందొచ్చు: కొత్త విధానంతో పాత ఈసీలు కూడా ఇట్టే కంప్యూటర్‌లో సులభంగా పొందొచ్చని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పాత రికార్డులను కాపాడుకోవటం చాలా కష్టంగా ఉంటోందని వాటిని ఎవరు పట్టుకెళతారోనన్న భయం కూడా తమను వెంటాడుతోందని రిజిస్ట్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. సగటున ప్రతి కార్యాలయంలో వేలల్లో పాత రికార్డులు పేరుకుపోయాయి. వాటి భద్రతకు సరైన స్ట్రాంగ్‌రూమ్ లేదని, వాటి నిర్వహణకు సిబ్బంది లేమి ఉండటంతో వాటికి చెదలపడుతోందని అంటున్నారు. వీటన్నింటికీ ఇకపై చెక్‌పెట్టవచ్చని చెబుతున్నారు.
ఇవీ చదవండి: