Omicron variant in telangana: తెలంగాణలో కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 2, 3 రోజుల నుంచి రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని.. కేసుల పెరుగుదల మూడో దశకు సంకేతమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయని.. అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీహెచ్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా సామాజిక వ్యాప్తి చెందుతోందని.. డెల్టా వేరియంట్ కంటే ఇది 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు.
టీకాతో రక్ష
వచ్చే 2-4 వారాలు అత్యంత కీలకం. దాదాపు 90 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదు. టీకా తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలి. నూతన సంవత్సర వేడుకల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సంక్రాంతి తర్వాత మూడో దశ ప్రారంభానికి అవకాశం ఉంది. - డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
మూడో దశతో కొవిడ్‌కు ఫుల్స్టాప్
DH on omicron variant: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని డీహెచ్ అన్నారు. అమెరికాలో 4 లక్షలకు పైగా, ఫ్రాన్స్‌లో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని.. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో ఒమిక్రాన్ విస్తరిస్తోందని వివరించారు. దేశంలోనూ రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. కొత్త వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు కనిపించకపోవడంతో.. ఐసోలేషన్ సమయాన్ని కూడా కొన్ని దేశాలు తగ్గించాయని డీహెచ్ పేర్కొన్నారు. మూడో దశతో కొవిడ్ పూర్తిగా అంతమయ్యే సూచనలున్నాయని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో ఉండటం పట్ల డీహెచ్ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు డీహెచ్ సానుభూతి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలతో ఒమిక్రాన్ వ్యాప్తికి అవకాశం ఉందన్న డీహెచ్.. ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యుల మధ్యనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: