యాజమాన్య కోటాలో డీఈడీ స్పాట్ అడ్మిషన్లు పొంది రెండేళ్లు విద్యనభ్యసించిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గురువారం నుంచి నిర్వహించనున్న అకడమిక్ పరీక్షలకు వారిని అధికారులు అనుమతించడం లేదు. కౌన్సెలింగ్ ద్వారా చేరనందున హాల్‌టికెట్లు ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
హాల్ టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరణ..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది వరకు మేనేజ్‌మెంట్ కోటాలో స్పాట్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఉన్నారు. 2018–2020 విద్యా సంవత్సరంలో డీఈడీ కళాశాలల యాజమాన్యాలు ర్యాంకులతో సంబంధం లేకుండా విద్యార్థులను చేర్చుకున్నాయి. అసలు ప్రవేశ పరీక్షలకు హాజరు కాని వారికి సైతం సీట్లిచ్చాయి. వాస్తవానికి ప్రవేశపరీక్షకు హాజరై... ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా చేరాలి. 2015లో జారీ చేసిన జీవోను పట్టించుకోకుండానే యాజమాన్యాలు విద్యార్థులను చేర్చుకోవడం వల్ల వారి భవిష్యత్ అగమ్యగోచరమైంది. తీరా రెండేళ్ల కోర్సు పూర్తైన తర్వాత విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.
విద్యార్థి సంఘాల ఆందోళనలు...
యాజమాన్యాలు చేసిన తప్పిదానికి తమను ఇబ్బందిపెట్టొద్దంటున్నారు విద్యార్థులు. గుంటూరులో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు నిరాహార దీక్షలకు దిగారు. వీరిలో ముగ్గురు విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోగా జీజీహెచ్‌కు తరలించారు. నెల్లూరులో విద్యార్థులకు మద్దతుగా డీఈడీ కళాశాల యాజమాన్య సంఘం ఆందోళన నిర్వహించింది. కడపలో ఎఐఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరనస తెలిపినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రెండేళ్లు చదివిన తర్వాత ఇప్పుడు పరీక్షలకు అనుమతివ్వకపోతే... తమ బిడ్డల పరిస్థితేంటని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షల ప్రారంభానికి కొన్నిగంటలే సమయం ఉన్నందున ప్రభుత్వం.. తమకు అనుకూల నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండి