త్వరలో రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగడం, 3 రాజధానులు ఏర్పడటం ఖాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటుకు సహాయం చేయాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారం సహా పలు అభివృద్ధి అంశాలపై చర్చించారని వెల్లడించారు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై కేంద్రమంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, ఇళ్ల నిర్మాణం, ప్రజాపంపిణీ వ్యవస్థ సంబంధించిన సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ చర్చించారని సజ్జల తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని, తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. కేసుల మాఫీ కోసమే సీఎం జగన్ దిల్లీ వెళ్లారంటూ తెదేపా నేతలు చేస్తోన్న ఆరోపణలను ఖండించారు. సీఎం జగన్‌ది వ్యక్తిగత పర్యటన కాదని స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన సాగిందని సజ్జల చెప్పారు. సీఎం జగన్‌పై పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులేనని, పెట్టిన కేసులన్నీ కక్ష పూరితంగా తెదేపా, కాంగ్రెస్ కలిపి పెట్టినవేనని వ్యాఖ్యానించారు. జగన్‌పై వచ్చిన ఆరోపణలను ప్రజలు ఇప్పటికే తిప్పికొట్టారన్నారు. బెయిల్ రద్దు కోసం మోదీ వైపు నిలబడే తత్వం జగన్‌ది కాదన్నారు. శాసన మండలిని రద్దు చేయాలని ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, శాసమండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. శాసన మండలిని రద్దు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు.
ఇదీ చదవండీ... CM Jagan With Union Ministers: జగన్ దిల్లీ టూర్.. ఎవరెవరిని కలిశారంటే..