కరోనా సమయంలో ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్తదారులను ఎంచుకుంటున్నారు. వ్యాక్సిన్, ఆక్సిజన్ పేర్లు చెప్పి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్ సూచించారు. సోమవారం ఓ వ్యక్తికి 912250041117 నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని.. అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. 'మీరు టీకా వేసుకున్నట్లైతే 1 నొక్కండి' అని సూచించాడని తెలిపారు. వెంటనే బాధితుడు 1 నొక్కగా.. క్షణంలోనే అతని ఫోన్ హ్యాక్ అయిందని వెల్లడించారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలన్నారు.
లక్షల్లో దోచేస్తున్నారు..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవాయువు (ఆక్సిజన్) కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి బాధితులకు అండగా నిలవాలని భావించిన ఓ స్వచ్ఛంద సంస్థ గాలితో ప్రాణవాయువు సృష్టించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంది. తక్కువ ధరకే ప్రముఖ కంపెనీ కాన్సన్‌ట్రేటర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రకటనలు గుప్పించారు. అది నిజమేనని నమ్మిన ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్న నంబర్‌కు సంప్రదించారు. వెంటనే కాన్సన్‌ట్రేటర్లు సరఫరా చేస్తామని నమ్మించి, బాధితుల నుంచి రూ.2.73లక్షలు, మరొకరి నుంచి రూ.1.14 లక్షలు దండుకున్నారు. తక్కువ ధరకే మాస్కులు, చేతి తొడుగులు, హెడ్‌షీల్డ్‌లు, శానిటైజర్లు అమ్ముతామంటూ ఎంతో మందిని మోసం చేశారు.
ఇదీ చదవండి: ఆస్పత్రుల్లో హృదయ విదారక దృశ్యాలు..బరువెక్కుతున్న గుండెలు