T20 Tickets: హైదరాబాద్ జింఖానా మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్‌లైన్ టికెట్ల విక్రయాలు పూర్తయినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఆన్‌లైన్ టికెట్లు ఈరోజు రాత్రి 7 తర్వాత అందుబాటులో ఉంచుతామన్నారు. ఈనెల 25న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వీక్షించడం కోసం టికెట్ల కొనుగోలుకు అంచనాలకు మించి క్రికెట్ అభిమానులు వచ్చారు. భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు.
తొక్కిసలాట: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ వేదికగా ఈ నెల 25న జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో.. సికింద్రాబాద్ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజుల నుంచే భారీగా అభిమానులు తరలివచ్చారు. హెచ్‌సీఏ టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతోందంటూ ఆందోళనలు చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్ఆర్సీలో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు ఇస్తామని హెచ్‌సీఏ ప్రకటించడంతో.. క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
చాలా మంది తరలివస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ.. సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్ గేట్ ద్వారా ఒక్కసారిగా అభిమానులు తోసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక సమస్యతో ఆన్‌లైన్ పేమెంట్లకు అంతరాయం కలిగింది. నగదు తీసుకుని సిబ్బంది టికెట్లు విక్రయిస్తున్నారు.
భారత్-ఆసీస్ మ్యాచ్ టికెట్ల వ్యవహారం కొంతకాలంగా ప్రహసనంగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాస్‌ల జారీలోనూ గందరగోళం ఏర్పడింది. కొవిడ్ పరిస్థితుల వల్ల క్రికెట్ మ్యాచులు వీక్షించేందుకు అభిమానులకు పెద్దగా అవకాశం రాలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా హైదరాబాద్‌లో నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో.. అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. అయితే సులభ ప్రక్రియలో టిక్కెట్లు ఇవ్వడంలో హెచ్‌సీఏ పూర్తిగా విఫలమైంది.
ఇవీ చూడండి: