కొవిడ్ అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పుడు పండుగలు పండగల్లా లేవు. వేడుకల తీరు మారిపోయింది. బయట ఏం కొనాలన్నా.. తినాలన్నా ఆలోచించే పరిస్థితి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా.. వెనకడుకు వేసే పరిస్థితి. ఈ ప్రభావం మిఠాయి పరిశ్రమపైనా తీవ్రంగా పడింది. ఒక్క రక్షా బంధన్ రోజునే మిఠాయి పరిశ్రమ ఐదు వేల కోట్ల నష్టాన్ని చవిచూసిందని నేషనల్ స్వీట్ మేకర్స్ ఫెడరేషన్ పేర్కొంది. గతేడాదితో పోలీస్తే.. 50శాతం వ్యాపారం నష్టపోయినట్లు ప్రకటించింది. కొవిడ్ దెబ్బకి నాలుగు మిఠాయిలు, ఆరు స్నాక్స్‌గా ఉన్న వ్యాపారం కాస్త.. సరైన వినియోగదారులు లేక వ్యాపారం సగానికి పడిపోయిన పరిస్థితి.
శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, వ్రతాలు, పూజలతో స్వీట్స్‌కు గిరాకీ బాగా ఉండేది. ఆరోగ్యం పట్ల, శుభ్రత పట్ల స్పృహ పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరి ఇళ్లల్లో వారు ఉండటం, తినటం చేస్తున్నారు. బయట నుంచి ఏదైనా కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి వెనకడుగేస్తున్నారు. ఇక వచ్చేది పండుగల సీజన అయినా... ఎంత గిరాకీ ఉంటుందో తెలియక స్వీట్స్ సిద్ధం చేసేందుకు వ్యాపారులు తటపటాయిస్తున్నారు. వినాయక చవితి, దీపావళి, దసరా వంటి పండుగలతో.. వ్యాపారాలకు ఊపుతెస్తాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు కొంత మేర కలిసివస్తారని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: త్వరలోనే మూడు రాజధానులకు శంకుస్థాపన చేస్తాం: సీఎం జగన్