కరోనా కారణంగా... రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో విద్యార్థుల కోసం ఆన్లైన్ పాఠాలంటూ యాజమాన్యాలు హడావిడి చేస్తున్నాయి. ఓ వైపు ఆన్లైన్ పాఠాలు అందరికీ అర్థం కావటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అందరికీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లేకపోవటం. ఉన్నా ఇంటర్నెట్ లేకపోవటం, నెట్వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ... ఫీజులు చెల్లించండంటూ... యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఎంత ఒత్తిడి తెస్తున్నా... పెద్దగా ఫలితం లేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. దీంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు.
వచ్చే విద్యా సంవత్సరానికిగాను అడ్మిషన్లు చేయించాలని ఉపాధ్యాయులపై యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అడ్మిషన్లు చేయిస్తే... జీతాలు చెల్లిస్తామని లేదంటే లేదని బెదిరిస్తున్నాయి. తమకు జీతాలు సరిగ్గా అందడం లేది ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లుగడవక... చాలా ఇబ్బందులుపడుతున్నామని వాపోతున్నారు.
కరోనా ప్రభావంతో మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒకవేళ ఉద్యోగం ఉన్నా.. సగం జీతాలు మాత్రమే తీసుకుంటున్నారు. కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో... ఇల్లు గడిస్తే చాలని భావిస్తున్నారు. పాఠశాలలు నడవకపోయినా.. ఫీజులు చెల్లించాలని అడగటం ఎంత వరకు సమంజసం అంటూ తల్లిదండ్రులు ధ్వజమెత్తుతున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకువచ్చి కట్టాలని ప్రశ్నిస్తున్నారు.
కరోనా అందరికీ ప్రాణసంకటంగా మారింది. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు గట్టెక్కుతారో తెలియటం లేదు. ఇలాంటి తరుణంలో... ప్రభుత్వాలు ఆదుకోవాలని ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది వేడుకుంటున్నారు.