అనంతపురం జిల్లా..
కొవిడ్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ.. మాస్కు తప్పనిసరిగా వాడాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సిరి తెలిపారు. కొవిడ్ -19 నివారణపై మాస్కు కవచం నినాదంతో జేసీ ఆధ్వర్యంలో నగరపాలక, వైద్య శాఖ వారు కలసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో మహమ్మారి కొంతమేరకు తగ్గినప్పటికీ నిర్లక్ష్యం వహించకుండా.. మాస్కు ధరించాలని పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లా..
కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే కవచమని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా.. పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గన్నవరంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో గన్నవరం ఎమ్మార్వో సీహెచ్ నరసింహారావు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలతో చందర్లపాడు, జగ్గయ్యపేటలో కరోనా పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా నివారణ, అరికట్టడానికి ప్రజల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో,ఎండీవో, పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది, పోలీసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నందిగామ పట్టణంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొవిడ్-19 అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, అధికారులతో కలిసి ఎమ్మార్వో కార్యాలయం నుండి పట్టణంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలతో ప్రజల సౌకర్యార్ధం పంచాయతీ వారి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. కృష్ణా జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాష్ రావు , తహశీల్దార్ రోహిణి దేవి పాల్గొన్నారు.
విశాఖ జిల్లా..
విశాఖ బీచ్ రోడ్డులో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కొవిడ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పార్క్ హోటల్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఏఎంసీ ప్రిన్సిపల్ సుధాకర్ పాల్గొన్నారు. కొవిడ్ ను నియంత్రించే దిశగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి ఆరోగ్య పరమైన సూత్రాలు అనుసరించాలని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో బుధవారం నిర్వహించిన కరోనా నివారణకు అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు.
కరోనా పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పాడేరులో ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చోడవరంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పడుతుందని అజాగ్రత్తగా ఉండవద్దుని అధికారులు హితవు పలికారు.
తూర్పుగోదావరి జిల్లా..
కరోనా నివారణ ర్యాలీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గన్నవరం ఎమ్మార్వో బీ మృత్యుంజయరావు, ఎంపీడీవోపీ చక్రధరరావు పాల్గొన్నారు. పి గన్నవరం కరోనా నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా..
కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం చైతన్య ర్యాలీ నిర్వహించారు. పది రోజుల పాటు కరోనా నివారణ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ప్రదర్శన జరిగింది.
చిత్తూరు జిల్లా…
చంద్రగిరిలో ఐసీడీఎస్, మండల,పంచాయతీ అధికారులు కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఎంపీడీవో రాధమ్మ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్య అధికారులు సూచనలు పాటించాలని పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కర్నూలు జిల్లా..
కర్నూలు జిల్లా ఆదోనిలో కొవిడ్ 19 ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ రామ కృష్ణ, పురపాలక కమిషనర్ కృష్ణ పాల్గొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి నుంచి ప్రాంతీయ ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ చేశారు. కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే.. మాస్కు తప్పని సరిగా ధరించాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. పత్తికొండలో బుధవారం కరోనాపై నిర్వహించిన అవగాహన ర్యాలీ లో ఆమె పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా..
మాస్క్ కవచం అని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో ర్యాలీ నిర్వాయించారు. కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కు కవచంలా పని చేస్తుందని అవగాహన కల్పించారు. సామాజిక దూరం పాటించాలని.. శానిటైజరు, సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. అనుమానం వస్తే వెంటనే కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కార్య క్రమంలో తహశీల్దార్ కరుణ కుమార్, ఎంపీడీఓ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: