రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 17 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులు తాము చదివే కళాశాలల్లోనే పరీక్షలు (సెల్ఫ్ సెంటర్లు) రాస్తున్నారు. దీనిని పలువురు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఒకప్పుడు ఎంబీబీఎస్, పీజీలో 40% నుంచి 50% మధ్య ఉత్తీర్ణులయ్యేవారు. ఈ మధ్యకాలంలో ఉత్తీర్ణులయ్యేవారు 70%-80%కి పెరిగారు. ఇటీవల ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎంబీబీఎస్, పీజీ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ 17 మంది చిక్కారు. వీరిని ఏడాదిపాటు డీబార్ చేశారు. వీరిలో ఒకే కళాశాలకు చెందిన విద్యార్థులు 14 మంది ఉన్నారు.
చెవుల్లో మైక్రో బ్లూటూత్‌లు...
గుంటూరు, వరంగల్‌లో ఇద్దరు విద్యార్థులు మైక్రో బ్లూటూత్‌లను చెవుల్లో పెట్టుకుని, బయటి వారి నుంచి జవాబులు వింటూ పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్లకు దొరికారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ తెలంగాణకు చెందిన కొందరు విద్యార్థులు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోనే పరీక్షలు రాస్తున్నారు. అలా వరంగల్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థికి జవాబులు చెప్పేందుకు పరీక్షకేంద్రం వెలుపల కారు, అందులో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఓ విద్యార్థి చేతిపై జవాబు రాసుకొని, గ్లౌజు ధరించి రాగా ఇన్విజిలేటరు పట్టుకున్నారు. కొందరు చిట్టీలు రాస్తూ చిక్కారు. ఇలా పలు వైద్య కళాశాలల్లో జరుగుతున్నా బయటకు రావడంలేదు. కాపీయింగ్ చేస్తూ చిక్కిన విద్యార్థుల్లో ‘రిఫరల్’ బ్యాచ్ వారు ఎక్కువమంది ఉంటున్నారు.
అక్రమాలపై చర్యలు తీసుకుంటాం
ప్రతి ఏడాదీ నలుగురైదుగురు విద్యార్థులు డీబార్ అయ్యేవారు. ఈసారి వారి సంఖ్య పెరిగింది. పరీక్షల నిర్వహణ దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా కళాశాలల్లోనే కాకుండా విశ్వవిద్యాలయం కేంద్రంగానూ పరిశీలించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. సీసీ కెమెరాల ఫుటేజీ సీడీలను ఏరోజుకారోజు విశ్వవిద్యాలయానికి తెప్పిస్తాం. కాపీయింగ్‌కు పాల్పడిన వారిపై వీసీ, రిజిస్ట్రార్లు, ఇతర నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ దుర్గాప్రసాద్, సీఈఓ, ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా.. జిల్లాకు 3 కేంద్రాల చొప్పున..!