Consumer Commission on Spicejet: అకారణంగా వృద్ధుడిని ఇబ్బందిపెట్టడంతో పాటు నిర్లక్ష్యంగా సేవలు అందించిన స్పైస్‌జెట్ ప్రైవేటు లిమిటెడ్ తీరును హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ తప్పుబట్టింది. నిషేధిత వస్తువు ఉందంటూ అతని బ్యాగ్‌ను పక్కన పెట్టడం... ఆ సమాచారం అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. 75 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని మానసికంగా ఇబ్బందిపెట్టినందుకు రూ.50వేలు పరిహారంగా చెల్లించాలని... కేసు ఖర్చులకు రూ.10వేలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది.
ఏం జరిగింది?
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ విఠల్‌వాడికి చెందిన ఘన్‌శామ్ దాస్ బజాజ్... వైద్యుడిని సంప్రదించేందుకు 2019 ఆగస్టు 14న హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లారు. చెక్‌ఇన్ సమయంలో అప్పగించిన బ్యాగు బెంగళూరు ఎయిర్‌పోర్టు వెళ్లాక పరిశీలిస్తే కనిపించలేదు. ఎయిర్‌లైన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా... ఆ బ్యాగు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోనే ఉందని... నిషేధిత పవర్‌బ్యాంకును తీసుకొచ్చినందుకు ఆపేశారని తెలిపారు. కంగారుపడిన బాధితుడు బ్యాగును తన వద్దకు పంపాలంటూ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి లేఖ రాశారు. వినియోగదారుల కేంద్రాన్ని సంప్రదించారు. అయినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బెంగళూరు ఎయిర్‌పోర్టులో తన భార్యతో కలిసి రోజంతా అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అధికారుల అనుమతితో ఘన్‌శామ్‌దాస్ బంధువు ఆ బ్యాగును మరుసటి రోజు తీసుకున్నారు. అయితే అందులో పవర్ బ్యాంకు లేకపోవడం గమనార్హం.
పరిహారం ఇవ్వాలని ఆదేశం
Complaint to Consumer commission : సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తనతో పాటు తన భార్య మానసికంగా ఇబ్బంది పడ్డామని, బ్యాగును తీసుకోవడానికి ఒక వ్యక్తి విలువైన కాలం వృథా అవడంతో పాటు ట్యాక్సీ ఖర్చులకు రూ.3,300 ఖర్చయ్యాయంటూ నాంపల్లిలోని జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. మానసిక వేదనకు పరిహారం ఇప్పించాలని కోరారు. వృద్ధుడి ఫిర్యాదును ఖండిస్తూ ప్రతివాద సంస్థ రాతపూర్వక వివరణ అందించింది. పేలుడు పదార్థాలు, సెల్‌ఫోన్ ఛార్జర్లు, పవర్‌బ్యాంకు వంటి వస్తువులు నిషేధిత జాబితాలో ఉన్నాయని... పవర్‌బ్యాంకు కనిపించడంతో ఆ బ్యాగును నిలిపివేశామంటూ చెప్పుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి ఆధారాలు ఎందుకు చూపడం లేదని, ఫ్రీ ఫ్లైట్ స్క్రీనింగ్ సమయంలో ఈ విషయాన్ని ఫిర్యాదీకి ఎందుకు చెప్పలేదని కమిషన్ బెంచ్ ప్రశ్నించింది. వృద్ధులకు అందించే సేవల్లో నిర్లక్ష్యం తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిషేధిత వస్తువు బ్యాగులో ఉన్నట్లు రుజువు చేయనందున ఫిర్యాదుదారుడికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: Chinthamani Drama: ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే.. నాటకాన్ని ఎలా నిషేధిస్తారు: హైకోర్టు