రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత రాజ్యాంగానికి 70ఏళ్లు పూర్తయిన సందర్భంగా... నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నెల్లూరు...
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేది... భాజపాయేనని ఆ పార్టీ నేత, కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. నెల్లూరులో 5 పార్లమెంటు నియోజకవర్గాల భాజపా జోనల్ సమావేశం నిర్వహించి... అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
కడప..
భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేడ్కర్ ఆశయాలను అందరూ పాటించాలని... రాజ్యాంగ పరిరక్షణ హక్కుల సమితి నాయకులు సంగతి మనోహర్ అన్నారు. కడపలో బైక్ ర్యాలీ నిర్వహించి రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు.
కృష్ణా జిల్లా..
బడుగుబలహీన వర్గాలతోపాటుగా... అగ్రకులాల్లోని పేదలకు సైతం నేటి సమాజంలో నిజమైన దేవుడుగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ నిలిచారని... రమాబాయి అంబేద్కర్ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సామాజిక వేత్త బత్తుల వీరమ్మ అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో శ్రీనివాస్ సెంటర్ నందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విశాఖ జిల్లా..
రాజ్యాంగ విలువలు, ధ్యేయాల సాధనకు యువత ముందుండి కృషిచేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య పి.వి.జి. డి. ప్రసాద్ రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా..
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని... తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజవర్గంలో పలుచోట్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
శ్రీకాకుళం..
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కర్నూలు..
భారత రాజ్యాంగం దినోత్సవ వేడుకలను కర్నూలులో ఘనంగా జరుపుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పాలనాధికారి వీరపాండ్యన్ అంబేడ్కర్‌కు నివాళులర్పించి... రాజ్యాంగం ప్రాముఖ్యత తెలిపారు.
గుంటూరులో...
ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం... భారత రాజ్యాంగమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి... 70 ఏళ్లు కావడం గర్వకారణమన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఇవీ చదవండి...భారత ఐక్యతకు పటిష్ఠ రాజ్యాంగమే కారణం: మోదీ