Collectors at RDO offices : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లాలను ప్రకటించింది. ఈ నూతన జిల్లాల్లో ఐఏఎస్‌ల నియామకాలు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, మౌలిక వసతులు, నిధుల కేటాయింపు కల్పన ఎలా ఉంటుందోనని అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాలో కలెక్టర్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కనీసం వంద కోట్ల రూపాయల చొప్పున అవసరమని అంచనా వేశారు. అంటే, మొత్తం రూ.1500 కోట్ల వరకు అవసరం కానుంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అదనంగా ఖర్చు లేకుండా చేయగలిగినంతే చేయాలని ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాల మేరకు, అందుకు అనుగుణంగా...అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వ శాఖలను కుదించడం ద్వారా భవనాల అవసరాలు తగ్గించేలా ప్రయత్నాలు జరగబోతున్నాయి.
ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 125 వరకు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ శాఖల్లో వేర్వేరు కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉంటాయి. కొత్త జిల్లాల రాకతో వీటిని ఒకే చోటకు తెచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. ప్రస్తుతం ఉన్న ఆర్డీఓ కార్యాలయాలను కొన్నిచోట్ల కలెక్టరేట్లుగా మార్చే విషయాన్ని పరిశీలించనున్నారు. అదే కార్యాలయ ప్రాంగణంలోనే ఆర్డీవో కూడా ఉండేలా సర్దుబాటు చేసే యోచనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటన చేసినప్పుడే ప్రత్యేకంగా ఏర్పడ్డ కమిటీలు ప్రభుత్వ భవనాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? వాటిల్లో ఏ ప్రభుత్వశాఖలు నడుస్తున్నాయి? జాతీయ రహదారికి ఎంత దూరంలో ఉన్నాయన్న వివరాలను సేకరించాయి. ఎస్పీ, ఇతర పోలీసు కార్యాలయాలపై పోలీసు శాఖ కసరత్తు చేసింది. తాత్కాలికంగా అద్దె భవనాల్లో కార్యాలయాలను నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి : Slight change in district names : పలు జిల్లాల పేర్లలో స్వల్ప మార్పు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!