Coal shortage: జెన్‌కో థర్మల్ యూనిట్లకు బొగ్గు సరఫరాపై ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పరోక్షంగా పడింది. బొగ్గు గనుల్లో పేలుడుకు వినియోగించే ప్రొపెలెంట్ పౌడర్ అధిక శాతం ఉక్రెయిన్ నుంచి వస్తుంది. అక్కడ యుద్ధం జరుగుతుండటంతో దిగుమతి కావడం లేదని సింగరేణి చెబుతున్నట్లు జెన్‌కో పేర్కొంది. దీనివల్ల బొగ్గు సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బొగ్గు సరఫరాను పెంచుకోవటానికి సింగరేణి అధికారులతో సంప్రదింపులు జరపడానికి గురువారం సమావేశం కావాలని జెన్‌కో అధికారులు భావిస్తున్నారు.
అడిగినంత ఇవ్వలేమంటున్న సింగరేణి
Coal shortage: 2021-22లో 7 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసేలా సింగరేణితో జెన్‌కో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ గత ఏడాది అక్టోబరు నుంచి దేశవ్యాప్తంగా తలెత్తిన బొగ్గు సంక్షోభంతో సరఫరా పూర్తిస్థాయిలో జరగటం లేదు. దీంతో థర్మల్ యూనిట్ల దగ్గర నిల్వలను పెంచుకోలేని స్థితి జెన్‌కోకు ఏర్పడింది. రోజువారీ బొగ్గు డిమాండ్ 65 వేల టన్నులుగా ఉంటే.. సింగరేణి, మహానది నుంచి 40-50 వేల టన్నులకు మించి రావటం లేదు. దీంతో బొగ్గు సరఫరా పెంచాలని సింగరేణిపై జెన్‌కో ఒత్తిడి చేస్తోంది. ప్రస్తుతం వీటీపీఎస్‌లో 54 వేల టన్నులు, ఆర్‌టీపీపీలో 26 వేల టన్నులు, కృష్ణపట్నంలో 28 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. అన్నిచోట్లా రెండు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. వీటీపీఎస్‌కు 15 రేక్‌లు, ఆర్‌టీపీపీకి 8 రేక్‌లు మార్గమధ్యలో ఉన్నాయి. సింగరేణి నుంచి రోజుకు 5 రేక్‌లు రావాల్సి ఉంటే.. ప్రస్తుతం 3 రేక్‌లకు మించి రావటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి సాధ్యం కాదని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: