ఇటీవలే ఆర్టీసీకి ఛైర్మన్‌ను నియమించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... సంస్థను గాడినపెట్టేందుకు చర్యలు చేపట్టారు. మరో నాలుగు నెలల్లో ఆర్టీసీని గాడిన పెట్టాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టి సంస్థను గాడినపెట్టాలని కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనాతో పాటు పెరిగిన డీజీల్ ధరలు ఆర్టీసీ నష్టాలకు కారణమైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తే కుదరదు... అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలు తెలుసుకోవాలని అప్పుడే సంస్థ బాగుపడుతుందని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఎంతసేపు కార్యాలయంలో కూర్చుని సమన్వయం చేసుకుంటే...క్షేత్రస్థాయిలో సమస్యలు ఎవరు తెలుసుకుంటారు..వాటిని ఎవరు పరిష్కరిస్తారని ఆర్టీసీ ఈడీ స్థాయి అధికారులను ఉన్నతస్థాయి అధికారులు మందలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరును మార్చుకోవాలని హితవుపలికినట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న 97 డిపోల్లో అన్నీ కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో అత్యధిక నష్టాలు వస్తున్నాయి. అందుకు గల కారణాలపై నివేదికలు తయారు చేసి వాటిని లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని అధికారులకు యాజమాన్యం స్పష్టం చేసింది.
సీఎం అసంతృప్తి..
ఆర్టీసీ టికెట్ ధరలు పెంచకుంటే సంస్థ మనుగడ కష్టమేనని అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదొక్కటే మార్గమని సీఎం కేసీఆర్‌కు రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేకసార్లు ఆదుకుందని..ఈ ఏడాది కూడా ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద మూడు వేల కోట్లు కేటాయించిందని.. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండడం లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్టీసీ టికెట్ ధరల పెంపుపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు.
3 వేల కోట్లు నష్టం...
డీజీల్ ధరలు లీటరుకు రూ.22 రూపాయలు పెరగటం వల్ల ఆర్టీసీపై రూ.550 కోట్లు అదనపు ఆర్థిక భారం పడుతోంది. దీంతో పాటు టైర్లు ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతుంది. మొత్తంగా సాలీనా 600 కోట్ల ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోయవలసి వస్తోంది. కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో 3 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఆర్టీసీలో ఇప్పటివరకు సుమారు 9 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉన్న 150 ఆర్టీసీ బస్సులను కార్గో రవాణా వాహనాలుగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటితో పాటు ప్రస్తుతం 28 మినీ కార్గో బస్సులు కూడా సేవలు అందిస్తున్నాయి. వీటికి అదనంగా మరో వెయ్యి బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ సంస్థ ఆలోచన చేస్తుంది. వీటితో పాటు పార్సిల్, కార్గో సర్వీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఒక యాప్‌ను తీసుకురాబోతున్నారు. దాని ద్వారా సరుకు ఎక్కడ ఉంది... ఏ ప్రాంతంలో ఉంది.. ఎప్పటి వరకు చేరుకుంటుంది... ఆ వివరాలు వినియోగదారులకు ఎప్పటికపపుడు చేరవేసే వెసులుబాటు ఉంటుంది. ఆర్టీసీకి కొత్తబస్సుల కొనుగోలు ఇప్పట్లో లేనట్లే అని యాజమాన్యం పేర్కొంటుంది.
నష్టాల నివారణపై దృష్టి...
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడుకోవడంపైనే యాజమాన్యం దృష్టి సారించింది. ఉద్యోగులకు, కార్మికులకు సకాలంలో వేతనాలు అందజేయటంతో పాటు నష్టాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టిసారించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త బస్సులు కొనుగోలు అనే ఆలోచన లేదని యాజమాన్యం సూచనాప్రాయంగా తెలిపింది.
ఇదీ చూడండి: