పీవీ నరసింహారావు వ్యక్తిత్వ పటిమను వర్ణించడానికి మాటలు చాలవని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకని పీవీ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలి అని సీఎం పేర్కొన్నారు. సంస్కరణాభిలాషికి నిలువెత్తు నిదర్శనమన్నారు. పీవీ ఏ రంగంలో ఉంటే.. ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారన్న ముఖ్యమంత్రి.. ఆయన జీవిత ప్రస్థానమంతా సంస్కరణలతో సాగిందని తెలిపారు. తాను నమ్మింది.. అనుకున్నది గొప్పగా చెప్పిన మహా వ్యక్తి పీవీ అని కొనియాడారు.
ప్రధాని పదవిని ముఠాలు కట్టి తెచ్చుకోలేదు..
ప్రపంచ దేశాలకు ఉత్తమ సందేశాలు ఇచ్చిన వ్యక్తి పీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి సంస్కరణ శీలిగా నిలిచారన్నారు. ప్రధాని పదవిని ముఠాలు కట్టి తెచ్చుకోలేదని.. ఆయనను వరించి వచ్చిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా చేసి సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. మనందరం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛకు పీవీనే కారణం అన్నారు. ఆయన విజ్ఞాన సముపార్జన చేసి.. ఆ వెలుగులను ప్రపంచానికి అందించారని వివరించారు.
ఇదీచూడండి: పీవీతో సాహిత్య అనుబంధం గురించి రచయితలు ఏమంటున్నారంటే!