CM Kcr Launched Presidential Suites: తెలంగాణలోని యాదాద్రిలో అధునాతన హంగులతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదాద్రికి చేరుకున్నారు. కొండ కింద ఉత్తర దిశలోని చిన్న కొండపై 13.2 ఎకరాల విస్తీర్ణంలో 14 విల్లాలు, ఒక ప్రధాన ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మించారు. అధునాతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు.
Kcr Yadadri Tour: ఆలయ మహాసంప్రోక్షణలో భాగంగా వచ్చే నెల 21న నిర్వహించే శ్రీసుదర్శన నారసింహ మహాయాగం ఏర్పాట్లను కేసీఆర్ పరిశీలించనున్నారు. 75 ఎకరాల్లో 126 పర్ణశాలల్లో ఒక్కో దాంట్లో ఎనిమిది కుండాలతో నిర్మించిన మహాయాగశాలను సందర్శిస్తారు. అనంతరం భువనగిరి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌తోపాటు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం రాయగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
సభ విజయవంతం చేసేందుకు కసరత్తు..
సీఎం పర్యటన దృష్ట్యా మంత్రి జగదీష్‌రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టరేట్ సుందరీకరణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ సభకు సుమారు లక్షా పది వేల మంది వస్తారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టు సభా స్థలి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా తెరాస ఆధ్వర్యంలో సీఎం భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి కమిటీలు, ఇంఛార్జిలను నియమించారు. జన సమీకరణకు నాయకులకు బాధ్యతలు అప్పగించారు.
భద్రతా చర్యలు..
సమావేశానికి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలకు పార్కింగ్ వసతితో పాటు... శాంతి భద్రతలకు, ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాచకొండ కమిషనర్ సీపీ మహేష్ భగవత్ కలెక్టరేట్ సముదాయం, సభాస్థలి వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవీ చూడండి
CBN: రేపు అనేది ఒకటి ఉంటుంది.. సీఎం జగన్‌కు చంద్రబాబు వార్నింగ్ !