CM KCR inaugurate Mallannasagar project :ఇవాళ చాలా సంతోషకరమైన రోజని టీసీఎం కేసీఆర్ అన్నారు. కలలు కన్న తెలంగాణ నేడు సాకారమయిందని చెప్పారు. నూతన తెలంగాణలో నిర్మించిన భారీ జలాశయం మల్లన్న సాగర్ అని పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. విహంగవీక్షణం ద్వారా ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. పూజా కార్యక్రమం తర్వాత మల్లన్నసాగర్ ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.
మల్లన్నసాగర్ కాదు.. ఇది తెలంగాణ జలసాగర్
'మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతిఒక్కరికి శిరస్సు వంచి ప్రణామాలు. ప్రాజెక్టును అడ్డుకోవడానికి దాదాపు 600కు పైగా కేసులు వేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో 58 వేల మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి మల్లన్న పాదాభిషేకం చేస్తామని ఆనాడు చెప్పాం. కాళేశ్వరం నిర్మాణంలో హరీశ్‌రావు పాత్ర ఎనలేనిది. హైదరాబాద్‌కు దాహార్తిని తీర్చే మహత్తర ప్రాజెక్టు.. మల్లన్నసాగర్. మల్లన్నసాగర్ కాదు.. ఇది తెలంగాణ జలసాగర్' -కేసీఆర్
దేశమంతా కరవు వచ్చినా..
మల్లన్నసాగర్‌లో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయని తెలంగాణ సీఎం తెలిపారు. ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిది అని కొనియాడారు. పరిహారం అందని వారు ఎవరైనా ఉంటే వారికి అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. పాలమూరు జిల్లాలో కూడా మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే... కాళేశ్వరం అని స్పష్టం చేశారు. దేశమంతా కరవు వచ్చినా.. తెలంగాణకు కరవు రాదని తెలిపారు.
చిన్నచిన్న లోపాలుంటే...
ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టులపై అవగాహన లేనివాళ్లే చిల్లర ప్రయత్నాలు చేస్తారని విమర్శించారు. విమర్శకుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చిన్నచిన్న లోపాలుంటే ఇంజినీర్లు సరిచేస్తారని తెలిపారు. పంజాబ్‌తో పాటీపడుతూ తెలంగాణలో ధాన్యం పండిస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగం చేసేవారు కూడా నేడు వ్యవసాయం చేస్తున్నారని... అద్భుత గ్రామీణ తెలంగాణ సాకారమవుతోంది అన్నారు. పాడిపరిశ్రమ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోందని వివరించారు.
ఇదీ చదవండి : New Districts: 'జిల్లాల విభజనపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం'