CM Jagan review: రుయా ఆస్పత్రి తరహా ఘటనలు పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ ఆస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయవాడ ఘటనలో సీఐ, ఎస్పై అలసత్వం వహించారనే ఆరోపణలపై చర్యలు తీసుకున్న విషయం ప్రస్తావించారు. ఒకట్రెండు ఘటనలతో మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్న ఆయన.. అలాంటి పరిస్థితి తలెత్తడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ప్రభుత్వం అంటే ప్రజలకు అన్నివేళలా మంచి చేయడమే లక్ష్యం కావాలన్నారు. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా.. వాహనాలపై నెంబర్లు ముద్రించాలని ఆదేశించారు. కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం తర్వాత వైద్యారోగ్యశాఖతో సీఎం సమావేశం నిర్వహించారు. కొవిడ్ నివారణా చర్యలను సమర్థంగా అమలు చేయాలని నిర్దేశించారు.
ఇదీ చదవండి: వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తత