రాష్ట్రంలో సమగ్ర భూసర్వే 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం'పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ సహా ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.‘ సర్వే ప్రక్రియలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కడ, ఎవ్వరు ఏ చిన్న అవినీతికి పాల్పడినా మొత్తం కార్యక్రమానికి చెడ్డపేరు వస్తుందని.. ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలని ఆదేశించారు. ప్రతి చోటా చెకింగ్ పక్కాగా ఉండాలని, ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ‘
మొత్తం భూ రికార్డులు, డేటాను అప్‌డేట్ చేస్తున్నాం కాబట్టి... కేంద్రం నుంచి ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం పొందేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియకు ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలని సూచించారు. సర్వే తర్వాత అన్నింటికి పక్కాగా సరిహద్దులు చూపాలని, మొత్తం సర్వే పూరైన తర్వాత చెత్తా చెదారం తొలగించి, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే జంగిల్ క్లియరెన్స్ కింద వాటన్నింటినీ తొలగించాలని దిశానిర్దేశం చేశారు. చివరగా రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు పాతాలని, రైతుల ప్రమేయం ఉండాలని సూచించారు. ‘
సర్వే వేగంగా పూర్తవుతున్నందువల్ల రాళ్ల సరఫరా కూడా అంతే ముఖ్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. సరిహద్దు రాళ్లు ఏర్పాటులో రైతుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. ప్రతి గ్రామ సచివాలయంతో పాటు, వార్డులలో హోర్డింగ్ పెట్టాలని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పూర్తి వివరాలు ఉండాలని సూచించారు. ముఖ్య కూడళ్లలో శాశ్వత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘
సమగ్ర సర్వే పూర్తైన 51 గ్రామాల్లో రికార్డుల ప్యూరిఫికేషన్, అప్‌డేషన్, సర్వే రాళ్లు పాతడం వంటివి పూర్తయ్యే నాటికి ఆయా గ్రామాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు కావాలని సీఎం జగన్ నిర్దేశించారు. ఈ ఏడాది జూలై నాటికి 51 గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రారంభం కావాలని, అప్పుడే సమగ్ర భూసర్వే పూరైనట్లన్నారు. గ్రామ సచివాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వే సజావుగా జరిగేలా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కావాలన్న సీఎం... వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలన్నారు. మొత్తం ఈ ప్రక్రియలో భూపరిపాలన చీఫ్ కమిషనర్‌ది కీలకపాత్ర అని సీఎం వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.26 లక్షల కిలోమీటర్ల ఏరియా...
రాష్ట్రంలో 17,460 గ్రామాలు, 47,861 ఆవాసాలకు సంబంధించిన సమగ్ర సర్వేకు పక్కాగా ఎస్‌ఓపీ రూపొందించినట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. తొలి దశలో ప్రతి జిల్లాలో ఒక గ్రామం చొప్పున 13 గ్రామాలు, ఆ తర్వాత ప్రతి డివిజన్‌కు 1 గ్రామం చొప్పున 51 గ్రామాలు, ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 51 గ్రామాలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణ పూర్తైందని, వచ్చే నెల నుంచి గ్రామస్థాయిలో సర్వే మొదలు పెట్టి, జులై నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.
ఇంకా 650 గ్రామాలకుగానూ, ఇప్పటికే 545 గ్రామాల్లో డ్రోన్లతో సర్వే పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ మేరకు ఛాయాచిత్రాలు సేకరించామని, వ్యవసాయ భూములు, హ్యాబిటేషన్లకు సంబంధించి 2,693 ఛాయాచిత్రాలు తీశామని అధికారులు వివరించారు. ఆ తర్వాత ఈ దశలోనే రెండో విడతగా మండలానికి ఒకటి చొప్పున 650 గ్రామాలలో సర్వే మొదలు పెట్టి వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేస్తామన్నారు. రెండో దశ సర్వేను వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరిలో మొదలు పెట్టి 2022 అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని వివరించారు. మూడో దశ వచ్చే ఏడాది నవంబరులో మొదలు పెట్టి ఏప్రిల్ 23 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. సర్వే సిబ్బందికి సంప్రదాయ సర్వే, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.
ఇదీ చదవండీ... కరోనా: మంత్రుల కమిటీ సమావేశంలో కీలకాంశాలపై చర్చ