CM Jagan review of housing department : రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల రూపంలో కొత్త మూన్సిపాలిటీలు అవతరిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాల్సిందిగా పురపాలక శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణశాఖలకు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇళ్లనిర్మాణ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ , గృహ నిర్మాణశాఖ మంత్రి జోగిరమేష్ తదితరులు హాజరయ్యారు. గతంలో నిర్వహించిన సమీక్ష మేరకు ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్ల నిర్మాణంపై సీఎం ఆరా తీశారు.
ఆప్షన్ –3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలు, ఇసుక, సిమెంట్, ఐరన్ లాంటి వనరుల సమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు త్వరితగతిన కోర్టు కేసు వివాదాల ఇళ్లపట్టాలపై స్పష్టమైన ఉత్తర్వుల కోసం ప్రయత్నించాలని సీఎం సూచించారు. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంకావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేయాల్సిందిగా ఆదేశించారు. ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌లైట్లు నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు.
లబ్ధిదారుడికి ఇంటి పత్రాలు ఇవ్వాలి: మరోవైపు 90 రోజుల్లో పట్టాలు పంపిణీపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారునికి ఇంటి స్థలం, పట్టా, సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ ఇవ్వాలని ఆదేశించారు. ఈమేరకు లబ్దిదారుల నుంచి ధృవీకరణ తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం సూచనలు చేశారు. జగనన్న కాలనీల్లో సత్వరం పౌరసేవలు అందేలా చర్యలూ తీసుకోవాల్సిందిగా సీఎం సూచనలు జారీ చేశారు.
ఇదీ చదవండి: జగన్‌ది విశ్వసనీయత కాదు.. విషపునీయత: చంద్రబాబు