కడప జిల్లా బద్వేలు వైకాపా ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట సుబ్బయ్య కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఏడాది నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 10 రోజుల కిందటే కడపకు వెళ్లిన ఆయన.. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.
బద్వేల్ వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భౌతిక కాయానికి ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. కడప కోపరేటివ్ కాలనీలో ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లిన ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేశారు. వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధ, కుమార్తె హేమంత, కుమారుడు తనయ్‌తో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు నివాళులర్పించారు.
1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. సౌమ్యుడిగా పేరున్న ఆయన... 2016లో బద్వేల్ వైకాపా సమన్వయకర్తగా పనిచేశారు. 2019లో తొలిసారిగా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. వెంకట సుబ్బయ్య భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.