కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. తొలి విడతలో సమర్థవంతంగా అధిగమించామని ఆయన తెలిపారు. ఆ నమ్మకంతోనే మొన్నటి స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఓటు ద్వారా రుజువు చేశారని చెప్పారు. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందన్న ఆందోళన అందరిలోనూ ఉందని సజ్జల తెలిపారు. ఆర్థిక వ్యవస్థ స్తంభిస్తే అన్ని వర్గాలు దెబ్బతింటాయని, దాని వలన జరిగే నష్టం, మరణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని సీఎం ఆందోళన చెందారని వ్యాఖ్యానించారు.
ఆర్థిక కార్యకలాపాలు యథాతథంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్న సజ్జల... తెదేపా అధినేత చంద్రబాబు ఎక్కడెక్కడో కూర్చుని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విపత్తులు వచ్చినప్పుడు ఎవరూ రాజకీయాలు చేయరని, అందరూ ఒక్కటై విపత్తులు ఎదుర్కొంటారని సజ్జల గుర్తుచేశారు. సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి మీడియా సహా అందరూ సహకరించాలని కోరారు. ఉద్యోగులను, విద్యార్థులను రెచ్చగొట్టడం పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉద్యోగుల వల్లే ఈ సమయంలో వ్యవస్థ నడుస్తుందన్న సజ్జల... వాళ్లకు అవసరమైన సహకారాన్ని ఇస్తామని స్పష్టం చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఉద్యోగులకు అందరూ మద్దతుగా నిలిచి కలిసి పనిచేయాలని సూచించారు. చంద్రబాబు కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడిలా వ్యవహరిస్తున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కొవిడ్ సెంటర్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారని సజ్జల వెల్లడించారు. కొవిడ్ కేర్ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఇదీ చదవండి: