మత్స్యకార జీవితాలు, రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ రూపురేఖలు మారబోతున్నాయని సీఎం జగన్ అన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. వీటి కోసం.. రూ.1510 కోట్లు వెచ్చిస్తున్నట్టు సీఎం తెలిపారు. మరో 4 ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో రూ.10 వేల కోట్లతో 3 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం తెలిపారు.
మత్స్యకారుల జీవితాలు దయనీయ పరిస్థితుల్లో ఉండటాన్ని పాదయాత్రలో గమనించానని సీఎం విచారం వ్యక్తం చేశారు. అవసరమైనన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు లేకపోవడాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం 3 వాగ్దానాలు చేసినట్లు గుర్తు చేశారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు.
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
మత్స్యరంగంలోని విస్తారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని మత్స్యకారులకు అందించే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆక్వా ఉత్పత్తుల దేశీయ వినియోగం కోసం రూ.225 కోట్లతో జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో 3 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. రెండు మూడు నెలల్లో టెండర్లు ఖరారవుతాయని సీఎం స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అవతార్ సినిమా చూపిస్తూ.. శస్త్రచికిత్స