CM Jagan in SLBC Meeting: అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా నిలవాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించేలా పలు చర్యలు చేపడుతోందని ఈ ప్రక్రయలో బ్యాంకర్లూ భాగస్వామ్యం కావాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 217వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. సీఎం అధ్యక్షతన జరిగిన భేటీలో యూనియన్ బ్యాంక్ సీఈఓతో పాటు, భారత రిజర్వ్ బ్యాంక్ సహా పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు చాలా కీలక పరిస్థితుల్లో బ్యాంకర్ల సమావేశం జరుగుతోందన్న సీఎం... కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ వేరియెంట్‌పై జరుగుతున్న ప్రచారం వల్ల ఆర్థికస్థితి కాస్త మందగించిందని, లేకపోతే ఆర్థిక పరిస్థితి చాలా వేగంగా పుంజుకునేదన్నారు. కరోనా థర్డ్‌వేవ్ దేశ ఆర్థిక రంగంపై చాలా తక్కువ ప్రభావం చూపాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రుణ పరిమితి పెంపునకు సంబంధించి బ్యాంకర్లను గట్టిగా కోరలేమన్నారు. కొవిడ్ వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపాయన్న ముఖ్యమంత్రి.... గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. ఓవైపు ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోగా, మరోవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడం వల్ల, ప్రభుత్వంపై భారం మరింత పెరిగిందన్నారు.
CM Jagan on Covid Situations: కొవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం 2019–20లో 8 వేల కోట్లు, 2020–21లో 14 వేల కోట్లు తగ్గిందన్నారు ముఖ్యమంత్రి జగన్. కొవిడ్ నివారణ, నియంత్రణ కోసం అదనంగా 8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ విధంగా కొవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 30 వేల కోట్ల భారం పడిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని గట్టెక్కించగలిగిందన్నారు. కరోనా సమయంలోనూ పథకాలను అమలు చేసి సామాన్య ప్రజలను, నిరుపేదలను ఆదుకోగలిగిందన్నారు. ఒకవేళ ఆ సహకారమే లేకపోతే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం చాలా కష్టమయ్యేదన్నారు. ఈ సమయంలో నిరుపేదలను ఆదుకోవడంలో సహకరించినందుకు బ్యాంకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకుల సహకారం వల్లనే గ్రామీణ ఆర్థిక పరిస్థితి కూడా గాడిలో పడిందని , కొవిడ్ కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకున్నందుకు బ్యాంకింగ్ రంగానికి సీఎం అభినందనలు తెలిపారు.
CM Jagan On Bank Loans to Farmers: ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల కాలంలోనే బ్యాంకులు చెప్పుకోదగిన స్థాయిలో రుణాలు మంజూరు చేశాయని సీఎం తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి స్వల్పకాలిక పంట రుణాలు ప్రోత్సాహక కరంగా ఉన్నాయని, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలు నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. రుణాల మంజూరు పెంచడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. బ్యాంకులు నిర్దేశించుకున్న నికర రుణ మొత్తంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు.. గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గాయని చెప్పారు. రెండో దశ కొవిడ్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కీలక సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారం దిశగా బ్యాంకులు దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఎందరో అర్హులైన రైతులకు ఇంకా ‘కిసాన్ క్రెడిట్ కార్డు లు అందాల్సి ఉందని, ఆర్బీకేల స్థాయిలో బ్యాంకులు వెంటనే ఆ కార్డుల జారీ చేపట్టి, అర్హులైన ప్రతి రైతుకు అందేలా చూడాలన్నారు. కౌలు రైతులందరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 4,240 ఆర్బీకేలలో బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కరెస్పాండెంట్లను నియమించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.
CM Jagan On House Scheme: పేదలందరికీ ఇళ్ల పథకం కింద 15.60 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్న సీఎం...ఇళ్ల నిర్మాణాలకు ఒక్కో లబ్ధిదారుడికి రూ. 35 వేల చొప్పున బ్యాంకులు రుణాలివ్వాలని ఆదేశించారు. అవసరమైతే ఇంటి స్థలాన్ని తనఖా పెట్టుకుని బ్యాంకులు రుణాలు ఇవ్వాలన్నారు. రుణాలపై లబ్ధిదారుల నుంచి కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. 2 లక్షల 62వేల216 టిడ్కో ఇళ్ల కు సంబంధించి బ్యాంకులు కాస్త చొరవ చూపి రుణాలు మంజూరు చేస్తే, సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఎంఎస్ఎంఈ లకు రుణాలు మంజూరులో బ్యాంకులు చొరవ చూపి,వీలైనన్ని రుణఖాతాలు ఓటీఆర్ వినియోగిచుకునేలా చూడాలన్నారు. బ్యాంకులు ఎంఎస్‌ఎంఈల విషయంలో సానుకూలంగా ఆలోచనే చేయాలని చెప్పారు. వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారి కోసం ఇస్తోన్న జగనన్న తోడు పథకం ద్వారా వచ్చే దరఖాస్తులను బ్యాంకులు వీలైనంత త్వరగా పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలని కోరారు.
విద్య, వైద్య రంగాలలో సమూల అభివృద్ధి చేస్తున్నామని ఈ ప్రక్రియలో బ్యాంకులు తమ వంతు సహకారాన్ని అందించాలని బ్యాంకర్లను సీఎం జగన్ కోరారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధితో పాటు, రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమించేలా పలు చర్యలు చేపడుతోందని , ఈ ప్రక్రియలో బ్యాంకులు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: