Cabinet meeting ‘దిల్లీ మద్యం స్కాం విషయంలో మా కుటుంబసభ్యులపైనా తెదేపా వాళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలను మంత్రులుగా మీరు గట్టిగా తిప్పికొట్టాలి కదా?’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో అన్నట్లు తెలిసింది. ‘తెదేపా, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు, అనవసర విమర్శలన్నింటిపైనా మంత్రులందరూ స్పందించాల్సిందే. ఇకమీదట వాళ్ల ఆరోపణలు, విమర్శలను ఉపేక్షించడానికి వీల్లేదు’ అని స్పష్టం చేసినట్లు సమాచారం. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీ సందర్భంగా అధికారులు బయటకు వెళ్లాక మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అదే సమయంలో తెదేపా నేతలు దిల్లీ మద్యం స్కాం విషయంలో సీఎం జగన్ భార్య పేరును ప్రస్తావిస్తూ ఆరోపణలు చేస్తున్నారన్న అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ‘ఆయన భార్యను అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు హడావుడి చేశారు. ఆయన పార్టీ మనుషులే ఇప్పుడు ముఖ్యమంత్రి భార్యకు దిల్లీ మద్యం స్కాంతో సంబంధం ఉందని అనవసర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుదేనా కుటుంబం? ఆయనకేనా కుటుంబ సభ్యులుండేది? ఇవతలి వారిది కుటుంబం కాదా? ఇవతలివాళ్ల కుటుంబసభ్యులపై ఏమైనా మాట్లాడేస్తారా? ఇదేం నీచమైన వ్యవహారం’ అని మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ‘తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే మాటే ఉండకూడదు’ అని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘కుటుంబసభ్యులపైనే కాదు, ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కూడా చెడుగా చూపిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్న వారందరికీ, తప్పుడు వార్తలు ప్రసారం, ప్రచారం చేసేవారికి మంత్రులంతా బలంగా కౌంటర్ ఇవ్వాలి’ అని సీఎం గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇకపై ప్రతి అంశంపైనా మంత్రులంతా స్పందించాలని ఆయన దిశానిర్దేశం చేశారని తెలిసింది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రులు తిరగాల్సిందే. మీ జిల్లాలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి’ అని మంత్రులకు ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. ‘ఎన్ని పనులున్నా నెలలో 16 రోజులకు తగ్గకుండా తిరగాలి’ అని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి: