High court Additional Building: రాష్ట్ర హైకోర్టు అదనపు భవన సముదాయ నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర.. భూమి పూజ చేశారు. అమరావతి నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రాంగణానికి ఎదురుగా ఉన్న మూడు ఎకరాల విస్తీర్ణంలో జీ+3 భవన నిర్మాణానికి లాంఛణంగా శ్రీకారం చుట్టారు. కొత్తగా నిర్మించబోయేది జీ+3 భవన సముదాయం అయినప్పటికీ.. జీ+5 పునాది రూపకల్పనతో దీన్ని నిర్మించనున్నారు. నిర్మాణ ప్రణాళిక, ఇతర అంశాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతరులకు ఉన్నతాధికారులు వివరించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మరో మూడు అంత్తసుల్లో నిర్మించనున్న ఈ భవన సముదాయ నిర్మాణాన్ని నిర్థేశించిన లక్ష్యంలోగా పూర్తి చేయాలని అధికారులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర సూచించారు.
ఆధునిక హంగులతో నిర్మాణం
Concreting for AP High Court Additional Building: ఈ భవన పనులు పూర్తయితే హైకోర్టుకు అదనంగా సుమారు 76 వేల 300 చదరపు అడుగులు సమకూరుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో లైబ్రరీ, రికార్డు రూం, రెండు ఫ్లెక్సిబుల్ కార్యాలయ స్థలాలు, మొదటి, రెండు అంతస్తులో ఒక్కొక్క అంతస్తులో 6 చొప్పున మొత్తం 12 కోర్టు హాళ్లు, మూడో అంతస్తులో 2 కోర్టు హాళ్లతోపాటు న్యాయమూర్తుల సమావేశ మందిరం, 3 ఆఫీస్ ఛాంబర్లు, కార్యాలయ స్థలం వసతి సమకూర్చుకునేందుకు హైకోర్టుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే సుమారు 60 వాహనాలు నిలిపేందుకు అనువుగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ యర్రా శ్రీలక్ష్మీ, కార్యదర్శి రాంమనోహర్, సీఆర్‌డీఏ కమిషనర్ విజయకృష్ణన్‌తోపాటు పలువురు న్యాయాధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..