అవినీతి కేసుల్లో ఉన్న సీఎం జగన్‌కు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ... న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్లే ఎంపీ రఘురామకృష్ణరాజుపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. జగన్ నిరంకుశ విధానాలను, అవినీతిని ప్రశ్నించినందుకే దుర్మార్గంగా వ్యవహరించారని విమర్శించారు. రఘురామకృష్ణరాజును అంతమొందించే కుట్ర జరుగుతోందని... ఆయన ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని చినరాజప్ప తేల్చిచెప్పారు.
రూల్ ఆఫ్ లా కంటే లాఠీకే పనిచెబుతున్న పోలీసుల తీరు హేయమని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు జగన్ కార్యకర్తల్లా అరాచకాలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. "జగన్‌రెడ్డి ఆనందం కోసం కొందరు పోలీసు అధికారులు పని చేస్తున్నారు. ఎంపీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను ఏ విధంగా శారీరక హింసకు గురి చేస్తారు? ఆయన నేరస్థుడు కాదు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా వెళ్లి అరెస్టు చేయడమే పెద్ద నేరం. థర్డ్ డిగ్రీ అమలు చేయడం మరో తప్పు. ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్షానికి, ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది?. ఏపీలో ఐపీసీ సెక్షన్ల బదులు వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర బృందాలతో విచారణ జరిపించాలి" అని చినరాజప్ప వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: