Ranjith reddy On Botsa comments: ఏపీలో నీళ్లు, కరెంట్ లేవన్న కేటీఆర్ వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఏపీలో అధికార వైకాపా నేతలు.. తమదైన శైలిలో తెరాసపై విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్‌లో కరెంట్ లేదన్న ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో.. అందుకే కట్ చేసి ఉంటారని వ్యంగ్యంగా మాట్లాడారు.
బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో.. అందుకే కట్ చేసినట్లు ఉన్నారు. తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోదు. అరగంట లేకపోతే మనం తట్టుకోలేక పోతున్నాం. అప్పుడు ఏం ఉన్నాయో.. ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. హైదరాబాద్‌లో మంచిగుందని మాకు ఫోన్ చేసి అడుగుతున్నరు. హైదరాబాద్‌లో ఉన్న వైకాపా నేతలను అడిగితే నిజం తెలుస్తుంది. జగన్ కుటుంబం ఇక్కడే ఉంటుంది.. వాళ్లను అడిగినా నిజం చెప్తారు. కేసీఆర్ పాలన బాగుందని వైకాపా ఎంపీలే నాతో అన్నారు. మా పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. 2014లో రాష్ట్రం ఏర్పడితే మీకు పాలన చేతగాదు అన్నారు. ఇప్పుడు వాళ్ల ఎంపీలే మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. మాకు ఏపీతో పోటీ కానే కాదు. - రంజిత్ రెడ్డి, చెవేళ్ల ఎంపీ
తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోవడం లేదని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న వైకాపా నేతలను అడిగితే నిజం చెప్తారని ఎద్దేవా చేశారు. జగన్ కుటుంబం కూడా ఇక్కడే ఉంటుంది.. వాళ్లను అడిగినా నిజం చెప్తారన్నారు. కేసీఆర్ పాలన బాగుందని వైకాపా ఎంపీలే నాతో అన్నారని ఎంపీ పేర్కొన్నారు. ఏపీ పథకాలు తెలంగాణలో అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్న ఆయన.. కేసీఆర్ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఏపీలో కరెంటు, నీళ్లు లేవు.. క్రెడాయ్ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్
కేటీఆర్ నోట.. జగన్ విధ్వంస పాలన మాట... చంద్రబాబు, లోకేశ్ ట్వీట్