పాలనా వ్యవహారాల్లో భారీ ప్రక్షాళనకు ప్రభుత్వ కార్యాచరణ చేపట్టింది. ఏళ్ల తరబడి ప్రభుత్వ పేషీల్లో పాతుకుపోయిన సిబ్బందిని మార్చేందుకు కసరత్తు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల పేషీలు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లోని పేషీల్లో మూడేళ్లకు మించి పని చేస్తున్న వారిని బదిలీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ మేరకు సర్వీసు నిబంధనలలో మార్పు చేస్తూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. పేషీల్లో బదిలీలకు సంబంధించి కేవలం ముఖ్యమంత్రి కార్యాలయానికి మాత్రమే నిలుపుదల అధికారం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫోర్ ఉద్యోగి వరకు పేషీల్లో ఉన్నవారిని మార్పు చేయాలని స్పష్టం చేశారు. డిసెంబరు 31లోగా ఈ మార్పుచేర్పులు జరగాలని స్పష్టం చేశారు.