రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవలసిన వ్యూహంపై పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యకర్తలపై దాడులను సహించేది లేదని.. దీనిని ఎదుర్కొని తీరుతామని స్పష్టం చేశారు. కేసులకు భయపడొద్దని అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చలో పల్నాడు
పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు నిరసనగా చేపట్టిన చలో పల్నాడు కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికే పల్నాడులోని ఆత్మకూరులో సభ నిర్వహిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ఒంటరి కాదని.. వ్యవస్థ అనే విషయాన్ని ఈ సభ ద్వారా చాటుదామన్నారు. మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు.. ప్రైవేటు కేసులు నమోదు చేద్దామని చెప్పారు.
ఆటలు సాగనివ్వం
వైకాపా నేతల ఆటలు సాగనివ్వమని.. ఇష్టానుసారం దాడులు చేయడం కేసులు పెట్టడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అందరికంటే ముందు తానే నిలుస్తానని.. తనపైన కేసు పెడతారేమో చూద్దామని చంద్రబాబు కార్యకర్తలతో అన్నారు. ఈనెల 10న తెదేపా లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామని.. పార్టీకి చెందిన న్యాయవాదులంతా హజరవుతారని చెప్పారు. లీగల్‌సెల్ ను పటిష్ట పరిచి.. కార్యకర్తలకు అండగా నిలుపుతామన్నారు.
ఇదీ చదవండి:తెదేపా అభియోగపత్రానికి వైకాపా పోటీ పత్రం