పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోందని తెదేపా అధినేత ఆరోపించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో అచ్చెన్నాయుడు, ఇతర నేతల అరెస్టులు, పట్టాభిపై దాడిని చంద్రబాబు, లోకేశ్ ఖండించారు. నిన్నటిదాకా నామినేషన్లు వేయకుండా అడ్డంకులు, బలవంతపు ఏకగ్రీవాలకు వైకాపా కుట్రలు పన్నిందని నేతలు మండిపడ్డారు. వాటిని ప్రజలే తిప్పికొట్టడంతో వైకాపా పిచ్చి పరాకాష్టకు చేరిందని చంద్రబాబు దుయ్యబట్టారు. నామినేషన్లు వేశారన్న అక్కసు భరించలేకే .. అక్రమ నిర్బంధకాండ చేస్తున్నారన్నారు. తెదేపా నేతల గృహనిర్భందాలను అందరూ ఖండించాలని చంద్రబాబు సూచించారు.
అన్ని స్థానాల్లో నామినేషన్లు వేయండి
ఎన్నికల ప్రక్రియ నుంచి తెదేపా శ్రేణుల దృష్టి మళ్లించేందుకే వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండి జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాలని చంద్రబాబు సూచించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలన్నారు. 2వ దశ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో నామినేషన్లు వేయాలని సూచించారు. బెదిరించి, బలవంతపు ఏకగ్రీవాలు చేయాలనే వైకాపా కుట్రలను భగ్నం చేయాలన్నారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, హౌస్అరెస్ట్లతో తెదేపాను అణచలేరని తెలిపారు.
రాష్ట్రాన్ని వైకాపా రావణకాష్టంలా చేసింది
ప్రజల్లో ఆదరణ ఉన్నంతకాలం తెదేపాను ఎవరేం చేయలేరని స్పష్టం చేశారు.. హత్యలు, ఆత్మహత్యలు, హింసా విధ్వంసాలతో రాష్ట్రాన్ని వైకాపా రావణకాష్టంలా చేసిందని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దమనకాండకు పాల్పడుతోందని.. బాధితులంతా ఏకమై తిరగబడితే వైకాపా భూస్థాపితం ఖాయమన్నారు. బంగాళాఖాతంలో వైకాపాని కలిపేయడం తథ్యమన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలే వైకాపాకు తగిన బుద్ది చెప్పాలని కోరారు. తెదేపా నాయకులను బేషరతుగా విడుదల చేసి తప్పుడు కేసులను తక్షణమే ఎత్తేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు...
మంత్రులే చంపుతాం, ఇంటికొచ్చి కొడతామని బెదిరించడంపై పోలీసులకు ఫిర్యాదుచేస్తే కనీసం పట్టించుకోలేదని లోకేశ్ విమర్శించారు. జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి వైకాపా మంత్రులే వార్నింగ్ ఇచ్చి మరీ గూండాలతో దాడి చేయించారంటే ఎంతగా బరి తెగించారో అర్థమవుతోందన్నారు. వైకాపా బెదిరింపులకు అదరం.. బెదరమని తెలిపారు. వారి అరాచకపాలనను అంతమొందించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి. అచ్చెన్న అరెస్టు.. జగన్ కక్ష సాధింపునకు పరాకాష్ట: చంద్రబాబు