ఇది అమూల్‌కు మేలు చేసే కుట్రే : తెదేపా అధినేత చంద్రబాబు
సంగం డెయిరీని దెబ్బతీసి అమూల్‌కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డెయిరీని నిర్వీర్యం చేసి.. పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.
chandra babu fires on dhulipalla narendra arrest
తెదేపా సీనియర్ నేత, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా నేతలు తీవ్రంగా ఖండించారు. అమూల్‌కు లబ్ధి చేకూర్చడంలో భాగంగా సహకార డెయిరీలను దెబ్బతీసి కక్ష సాధించాలనే ధూళిపాళ్లను అరెస్టు చేశారని ఆరోపించారు. కరోనా నియంత్రణలో విఫలమై ప్రజలను పక్కదారి పట్టించేందుకే తెదేపా నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. గుజరాత్‌కు చెందిన అమూల్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకొని రాష్ట్రంలోని సహకార డెయిరీలను ముఖ్యమంత్రి దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్థానిక రైతుల భాగస్వామ్యంతో నడుస్తున్న సంగం డెయిరీని నిర్వీర్యం చేసేందుకే నరేంద్రపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. ‘రెండేళ్లలో అభివృద్ధి లేకపోయినా అక్రమ అరెస్టులు మాత్రం ఉన్నాయి. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసుకుంటూపోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరు. ధూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలి’ అని ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఆయన తీవ్రవాదా? ఆర్థిక ఉగ్రవాదా?
- తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ప్రజాక్షేత్రంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనే అక్కసుతో ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘ధూళిపాళ్ల ఇంటికి వందలాది పోలీసులను పంపడానికి ఆయనేమైనా తీవ్రవాదా? లేదా ఏ1, ఏ2ల్లా ఆర్థిక ఉగ్రవాదా? మచ్చలేని వ్యక్తిని దొడ్డి దారిలో అరెస్టు చేయటం దుర్మార్గం’ అని దుయ్యబట్టారు.
రాజకీయంగా ఎదుర్కోలేక పగబట్టారు
- శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు
ధూళిపాళ్ల నరేంద్రను రాజకీయంగా ఎదుర్కోలేకే పగబట్టారని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. ‘తన రూ.లక్ష కోట్ల అవినీతిని బయటపెట్టి 16 నెలల జైలుకు కారణమయ్యారనే జగన్.. తెదేపా నాయకులను లక్ష్యం చేసుకున్నారు. అమూల్‌పై ప్రేమతో రాష్ట్రంలో డెయిరీ వ్యవస్థనే కాలరాయాలనుకోవడం దారుణం’ అని ఆరోపించారు.
దొంగ కేసులపై ప్రశ్నించినందుకే
- తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్
ప్రభుత్వం పెట్టిన దొంగ కేసులను ఆధారాలతో సహా ఎండగట్టినందుకే ధూళిపాళ్ల నరేంద్రపై జగన్ కక్షగట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరిట ఆడిన డ్రామాను స్టింగ్ ఆపరేషన్‌తో నరేంద్ర బట్టబయలు చేసినందుకే ఈ కక్ష సాధింపు. ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో జగన్ రాక్షసానందం పొందుతున్నారు. వేలాది పాడి రైతులకు సంగం డెయిరీ ద్వారా నరేంద్ర అండగా నిలిచారు. నలుగురికి సాయం చేశారు తప్ప జగన్‌లా ధూళిపాళ్ల దోపిడీ చేయలేదు. చట్టం ముందు జగన్ అన్యాయం విజయం సాధించలేదు’ అని ప్రకటనలో దుయ్యబట్టారు.
* నరేంద్ర సతీమణి జ్యోతిర్మయిని లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. కరోనా విజృంభిస్తుంటే 400 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించారని ఆమె తెలిపారు. విచారణకు సిద్ధమని, అన్ని విధాలా సహకరిస్తామని నరేంద్ర చెప్పినా యుద్ధ వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని లోకేశ్ ఆమెకు సూచించారు.
పైశాచికానందమే: మాజీ మంత్రి దేవినేని ఉమా
‘రాష్ట్రంలో కరోనా విలయ తాండవంతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులంటే సీఎం కక్ష సాధింపు చర్యలకు పరిమితమయ్యారు. పైశాచిక ఆనందానికి ఆయన విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. రూ.1,100 కోట్ల టర్నోవర్ ఉన్న సంగం డెయిరీకి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. అమూల్ డెయిరీకి రాష్ట్రంలో ప్రోత్సాహం దొరకట్లేదనే అక్కసుతో నరేంద్రను అరెస్టు చేశారు. జగన్ అక్రమాస్తులపై పోరాడినందుకే ఈ రాజకీయ కక్ష. కోర్టు ఆదేశాల మేరకు నాపై పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించిన అన్ని అధారాలను ఈ నెల 29న సీఐడీ విచారణకు హాజరై అందిస్తా.’
అరెస్టు దారుణం: ఎంపీ జయదేవ్
నరేంద్రను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని, తక్షణమే ఆయన్ను విడుదల చేయాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. ‘రాజకీయ జీవితంలో మచ్చలేని నరేంద్రను ఏదో ఒక విధంగా జైలుపాలు చేయాలని జగన్ కుట్ర పన్నారు. నేరమేమిటో చెప్పకుండా అప్పటికప్పుడు నోటీసులనిచ్చి వందలాది పోలీసులొచ్చి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం?’ అని శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.యబట్టారు. ప్రజలను పక్కదారి పట్టించడానికే అక్రమ కేసులని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లా చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
Last Updated : Apr 24, 2021, 5:25 AM IST
TAGGED:
dhulipalla narendra arrest