వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం తెలిపారు. వంగపండు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వంగపండు తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తన గొంతు, పదాలతో అశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారని అన్నారు. ప్రజా చైతన్యానికి వంగపండు ఎనలేని కృషి చేశారని అన్నారు. వంగపండు సాహిత్యం అనేక భాషల్లోకి అనువదించడం తెలుగు జాతికే గర్వకారణం అని పేర్కొన్నారు. వంగపండు మృతి తెలుగు జానపద సాహిత్య లోకానికి తీరని లోటన్నారు.
వంగపండు ప్రసాదరావు మృతితో ఉత్తరాంధ్ర గొంతు మూగబోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చివరి శ్వాస వరకూ గొంతెత్తి వందల జానపదాలకు గజ్జెకట్టారని అన్నారు. వంగపండు ప్రసాదరావు మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. వంగపండు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా విలయతాండవం- కొత్తగా 52,050 కేసులు